రాక్షసులకు బుద్ధి చెబుతాం.. అవినీతిని అంతమొందిస్తాం
We will teach wisdom to the demons.. We will end corruption
- ప్రకృతి వైపరీత్యాలు
- బాధితులకు అండగా నిలుద్దాం
- కుటుంబ రాజకీయాన్ని తరిమి కొడదాం
- దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకం
- 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు సన్నద్ధం
- దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
- 11వ సారి జాతీయ పతాకావిష్కరణ
- 78వ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశాన్ని లోలోపల భ్రష్టు పట్టించేందుకు వెళ్లూనుకునే వ్యవస్థ అవినీతి దాని అంతానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. కూకటివేళ్లతో సహా అవినీతిని పెకిలించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. కోల్ కతా ట్రైనీ వైద్య విద్యార్థిని హత్య దురదృష్టకరమన్నారు. అలాంటి రాక్షసులకు ఉరిశిక్ష ద్వారా తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. భవిష్యత్తుల్లో మహిళలు, ఆడపిల్లల జోలికి వెళ్లాలంటేనే వారు భయపడేలా శిక్షిస్తామన్నారు. కేరళ వయోనాడ్ లో ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలామంది కుటుంబ సభ్యులను, ఆస్తులను కోల్పోయి తీవ్ర బాధలో ఉన్నారు. వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ సంక్షోభ సమయంలో వారికి అండా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ లో నెలకున్న ఆందోళనకర పరిస్థితులు, హిందువులపై దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయంగా ప్రేరేతమై ఏ నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకోదన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు దేశ భవిష్యత్, అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందువరుసలో ఉందన్నారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నాం. 2036లో భారత్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్నారు.
గురువారం భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై 11వ సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. అనంతరం 103 నిమిషాలపాటు సుధీర్ఘ ప్రసంగం చేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహానీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం అన్నారు. దాన్ని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
కోల్ కతా ఘటన అమానుషం..
మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడే వారిని రాక్షసులుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. వారికి ఉరిశిక్షే సరైందన్నారు. ఓ వైపు మహిళలను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసే చర్యలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఈ దాడులపై సత్వర తీర్పు, శిక్షలు అవసరమన్నారు. కోల్ కతా ఘటన తమను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. ఇలాంటి రాక్షసులలో భయం పుట్టించాలన్నారు.
అవినీతిని తరిమి కొడతాం..
దేశ భవిష్యత్ ను నాశనం చేస్తుంది. కుటుంబ రాజకీయం, అవినీతి అన్నారు. అవినీతికి కొందరు కుహానా రాజకీయ వాదులు అలవాటులా మార్చేశారన్నారు. కానీ తమ పాలనలో వారి ఆటలు సాగనీయబోమన్నారు.కుటుంబ రాజకీయాన్ని, అవినీతిని పూర్తిగా అంతం చేసే వరకు ఉరుకోబోమన్నారు. బంధుప్రీతి, బుజ్జగింపులతో దేశాన్ని చెదపురుగుల్లా వీరి చర్యలు పట్టిపీడీస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. వీటిపై నిబద్ధతో వ్యవహరిస్తూ దేశం నుంచి ఇలాంటి వ్యవస్థలను తరిమి కొడతామన్నారు. ఇందుకు దేశ ప్రజలు కూడా తమతో సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. సువర్ణ భారత్ నిర్మాణంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం కావాలని ప్రధాని కోరారు.
ప్రకృతి వైపరీత్యాలు.. బాధితులకు అండగా ఉందాం..
అత్యాధునిక సాంకేతికతను సాధిస్తున్న ఈ సయమంలోనూ ప్రకృతి వైపరీత్యాల వల్ల పెను నష్టం వాటిల్లుతోందన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో నష్టపోయిన వారికి దేశ ప్రజలంతా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ పరంగా వీరికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని తెలిపారు.
బానిస సంకెళ్లను తెంచిన మహానీయులు..
బానిస సంకెళ్లను తెంచేందుకు అనేకమంది ప్రయత్నించారన్నారు. ప్రతీ ఒక్క వర్గం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిలో ఉన్నారని ప్రధాని తెలిపారు. బానిస సంకెళ్లు తెంచేందుకు అన్ని వర్గాల వారు అత్యంత ప్రాధాన్యత పాత్ర పోషించారని కొనియాడారు. ఈ సందర్భంలో ఎంతోమంది మహానీయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని తెలిపారు. వారందరికీ నిజమైన నివాళి అర్పించే సమయం ఆసన్నమవుతోందన్నారు.
2036లో ఒలింపిక్స్ కు సన్నద్ధం..
2036లో భారత్ లో జరిగే ఒలింపిక్స్ కు దేశం సన్నద్ధమవుతుందన్నారు. జీ–20 సమావేశాల నిర్వహణ దేశాన్ని ప్రపంచదేశాల్లో ముందువరుసలో నిలబెట్టిందన్నారు. ఇలాంటి పెద్ద కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రపంచంలో భారత్ సత్తాను చాటగలిగామన్నారు.
అభివృద్ధి ఏజెండా..
దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్లడంలో భాగంగా గత 11యేళ్లుగా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. 25 కోట్లమందిని పేదరికం నుంచి దూరం చేశామన్నారు. ప్రతీ ఇంటికి నళ్లాల ద్వారా నీరందిస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు. రైతు, మహిళ, యువత, నిరుద్యోగుల సమస్యలను పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామన్నారు. తమ ఈ బృహత్తర ప్రయత్నంలో 140 కోట్ల మంది భారతీయులు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధింప చేసిన మన పూర్వీకుల ఆశలు, ఆశయాలను పుణికి పుచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 2047 వికసిత్ భారత్ కోసం దేశం పయనించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 21వ శతాబ్ధపు సువర్ణ భారత నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ తమతో కలిసి రావాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.
సివిల్ రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం..
దేశం సెక్యూలర్ సివిల్ కోడ్ (భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే చట్టం) వైపు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మత ప్రాతిపదికన ఏ దేశం వృద్ధిని సాధించలేదన్నారు. సివిల్ కోడ్ ఏ మతానికి, వర్గానికి వివక్షాపూరితమైనది కాదన్నారు. దేశ రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. రాజ్యాంగ నిర్మాతల కలలను ఇది సాకారం చేయడంలో కీలకపాత్ర వహిస్తుందన్నారు.
సాంకేతికతలో ముందు..
భారత్ నేడు సాంకేతికతలో దూసుకువెళుతుందన్నారు. ఐటీ, ఏఐ రంగాలలో నూతన ఆవిష్కరణలతో ప్రపంచంలో మనదేశ వాసులు ముందువరుసలో నిలవడం దేశానికే గర్వకారణమన్నారు. సాంకేతికత ద్వారా గేమింగ్ రంగంలో దేశం ప్రపంచంలో తమకంటూ సుస్థిర స్థానాన్ని సృష్టించుకోవడం సంతోషకరమన్నారు. డిజైనింగ్ ఇండియా, డిజైనింగ్ ఫర్ ది వరల్డ్ పైనే మన దృష్టి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని తెలిపారు. నూతనావిష్కరణలతో దేశాన్ని అనుసంధానించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తమ పూర్తి విశ్వాసం, నమ్మకం, బలంతో, తెలివితేటలతో ఈ రంగంలో దేశ యువత సత్ఫలితాలను సాధించడం గొప్పవిషయమన్నారు. ఈ రంగం మరిన్ని పరిశోధనల వైపు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో యువత మరిన్ని ఆవిష్కరణలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు.
వైద్య విద్యలో నూతన ఒరవడికి నాందీ..
వైద్య విధానంలో నూతన ఒరవడిని సృష్టిస్తామని తెలిపారు. నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ఉన్నత చదువుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరాన్ని పూర్తిగా మార్చివేసే దిశగా ప్రయత్నిస్తున్నామని ప్రధాని తెలిపారు. యువత ఎక్కువగా వైద్య విద్య కోసం ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నారని గుర్తించామని తెలిపారు. ఆ విధానాన్ని పూర్తి మార్చేందుకు పెద్ద యెత్తున ప్రభుత్వం ప్రయత్నాలను మొదలు పెట్టిందన్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలోనే 75వేల వైద్య విద్యసీట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీంతో వైద్య విద్య కోసం విద్యార్థులు ఇక విదేశాలకు వెళ్లే విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతామని ప్రధాన తెలిపారు.
రక్షణలో స్వయం సమృద్ధి సాధిస్తాం..
ఇంతకాలం దేశ రక్షణ కోసం ఆయుధాలు, పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డామన్నారు. కానీ తమ ప్రభుత్వం ఒక్కో అడుగుతోనే స్వయం సమృద్ధి దిశగా సాగుతోందన్నారు. దీంతో దేశీయ కొనుగోళ్లు పెరిగే చర్యలను చేపట్టామన్నారు. అదే సమయంలో విదేశీ కొనుగోళ్లను తగ్గించగలుగుతున్నామన్నారు. ఇదంతా దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా అత్యంత వేగంగా సాగుతున్న దేశమని ప్రధాని మోదీ తెలిపారు. దేశ సరిహద్దులను కాపాడడంలో సైనిక రంగం చేస్తున్న కృషికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రక్షణ రంగంలో దేశాన్ని పూర్తి స్వావలంభన దిశగా తీసుకువెళతామన్నారు.