నా తెలంగాణ, సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెండు ల్యాబ్ లను డాక్టర్ గాయత్రీ దేవి సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాలతో సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రులను డీఎం అండ్ ఎచ్ వో డా. గాయత్రీ దేవి మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులలో బయో వేస్ట్ మేనేజ్ మెంట్ పాటించాలన్నారు.
అన్ని ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని యజమాన్యాలను ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులు అందించే సేవలు వాటికి తీసుకుంటున్న చార్జీల వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేసి ఆసుపత్రికి వచ్చే రోగులకు కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. సంగారెడ్డి బైపాస్ రోడ్ లోని శిశురక్ష ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించగా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల వివరాలు, ఆసుపత్రిలో అందుతున్న సేవలకు పేషెంట్ల వద్ద వసూలు చేస్తున్న బిల్లుల్లో తేడాలను, ధరల పట్టిక ప్రదర్శన లేకపోవడాన్ని గమనించారు. డెంగ్యూ జ్వరంపై ఒక్కసారే పరీక్షలు జరిపి పేషెంట్లను భయబ్రాంతులకు చేస్తున్నట్లు గుర్తించి ల్యాబ్ ను సీజ్ చేశారు.
సంగారెడ్డి చౌరస్తాలో గల చరిత హాస్పిటల్ తనిఖీ నిర్వహించగా హాస్పిటల్ లో సరియైన పరిశుభ్రత, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్ మెంట్, ఫైర్ సేఫ్టీ, ల్యాబ్ లో రికార్డులు, తదితర లోపాలను గుర్తించి ఈ ల్యాబ్ ను కూడా సీజ్ చేశారు. ఆసుపత్రి యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
జిల్లాలోని అన్ని ఆసుపత్రులు తూ.చ. తప్పకుండా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని ఆదేశంచారు. లేకుంటే చట్టప్రకారం చర్యు తప్పవని గాయత్రీదేవి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ప్రజారోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.