నా తెలంగాణ, సంగారెడ్డి: స్వామి వివేకానంద చెప్పినట్లు ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోని నాలుగు గోడల మధ్యనే నిర్మించబడుతుందని పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ క్రాంతి వల్లూరు, తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనల చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
గురువులు భగవంతునితో సమానమని, గురువుల ఆధ్వర్యంలో ఎంతోమంది సమాజంలో ఉన్నతులుగా ఎదిగారని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం పోషిస్తున్న గురువులకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ తల్లిదండ్రులు మంచి నడవడికను నేర్పితే,గురువులు పిల్లలకు విద్యను బోధిస్తూ సమాజంలో తమ కాళ్లపై తాము నిలబడగలమనే నమ్మకాన్ని కలిగిస్తున్నారని అన్నారు. దాంతోబాటు సమాజంలో దార్శనికతతో మెలుగుతూ ఉన్నత స్థానానికి ఎదిగేలా వారిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారని తెలిపారు. విద్యార్థుల విషయంలో గురువుల బాధ్యత ఎనలేనిదని అభినందించారు. జిల్లాలో పిల్లలందరిని బడిలో చదివించే బాధ్యత గురువులది, తల్లిదండ్రులది అన్నారు.
టీఐఐసీసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు గురువుల పాత్ర కీలకమైందన్నారు. సమాజానికి ఆణిముత్యం లాంటి బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థులను అందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులకు సాటి ఎవరు రారని కొనియాడారు.
అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని శాలువాలు, జ్ఞాపికలు, పూలమాలలతో సత్కరించారు .
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, గురువులు పాల్గొన్నారు.