సంచలనాలకు ట్రంప్ రెఢీ!
Trump is ready for sensationalism!
జనవరి 20న 17 నిర్ణయాలపై సంతకాలు
జో బైడెన్ నిర్ణయాల్లో సమూల మార్పులు
ఇమ్మిగ్రేషన్ నుంచి ఇంధనం వరకూ కీలక నిర్ణయాలు
అక్రమ వలసలపై భారత్ – చైనాలకు అ‘శుభ’వార్త?
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఊపుమీదున్న డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీయనున్నారా? 2025 జనవరి 20న ట్రంప్ పదవి ప్రమాణ స్వీకారం చేపట్టగానే 25 నిర్ణయాలపై తొలిసారిగా సంతకాలు చేయనున్నట్లు ట్రంప్ కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న భారత సంతతికి చెందిన హర్మీత్ ధిల్లాన్ తెలిపారు. అయితే ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలను పూర్తి స్పష్టంగా వివరించలేదు. ప్రమాణ స్వీకారం రోజే 17 నిర్ణయాలపై సంతకాలు చేస్తారని, అటుపిమ్మట మిగతా నిర్ణయాలకు కూడా ఆమోదముద్ర వేస్తారన్నారు. దీంతో గతంలో జో బైడెన్ తీసుకున్న నిర్ణయాల్లో కీలక మార్పు చేర్పులు చోటు చేసుకోనున్నాయి.
ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు నుంచే తన పనితీరులో వేగం పెంచుతానని ట్రంప్ కూడా చెబుతున్నారు. ఇమ్మిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు పెద్ద నిర్ణయాలపైనే ఈ సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల ముసాయిదాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వలసదారుల బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి నెలకొంది. అక్రమ వలసదారుల్లో భారత్–చైనాకు చెందిన వారు అమెరికాలో భారీగానే ఉన్నారు. మరోవైపు అమెరికన్ల విశ్వాసాన్ని ట్రంప్ చూరగొంటారని అధికార ప్రతినిధి కరోలిన్ లెవిట్ చెబుతున్నారు. అంటే ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టడం లా నిర్ణయాలు తీసుకుంటారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. బైడెన్ నిర్ణయాలను నిష్ర్కియం చేయడం, అమెరికన్ల విశ్వాసాన్ని చూరగొనడం, తమ దేశాలతో సఖ్యతగా ఉన్న వారికి మేలు చేస్తూ కాదన్న దేశాలకు వ్యతిరేకంగా నిర్ణయాలను తీసుకోవడం వంటి నిర్ణయాలు ఇందులో ఉండనున్నాయని భావిస్తున్నారు.
ట్రంప్ నిర్ణయాల్లో ముఖ్యమైనవి..
ఇమ్మిగ్రేషన్, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడం, తమ దేశానికి ఎగుమతవుతున్న ఇతర దేశాల వస్తువులపై భారీగా సుంకం పెంపు, క్రిమినల్ రికార్డులు లేని అక్రమ వలసదారులను కూడా అరెస్టు చేసే అధికారం, ఇక్కడే జన్మించిన విదేశీయులకు పౌరసత్వ హక్కు నిరాకరణ?, స్థానికులకే ఉద్యోగాలు, విద్యనార్జించేందుకు వస్తున్న వారి ఫీజుల పెంపు, విద్యార్థుల తాత్కాలిక ఉపాధి, ఇంధన కొనుగోళ్లు, ఎగుమతులు, దిగుమతులపై కూడా పలు ఆంక్షలను విధించే యోచనలో ఉన్నారు. ఏది ఏమైనా జనవరి 20న ట్రంప్ తన నిర్ణయాలు, సంతకాలతో ప్రపంచదేశాలను సంతోష పెడతారా? లేక ఏడిపిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే!.