పూజా స్థలాల విచారణపై కొత్త పిటిషన్ లు దాఖలు చేయొద్దు
Do not file new petitions on investigation of places of worship
అన్ని పక్షాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ప్రైవేటు దావాపై స్టే .. కేంద్రం వ్యతిరేకత
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆలయం, మసీదు వివాదాల నేపథ్యంలో పూజా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టంపై సుప్రీం కీలక నిర్ణయం వెలువరించింది. తదుపరి విచారణ వరకు కొత్త పిటిషన్ లను దాఖలు చేయవద్దని అన్ని పక్షాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 1991 చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కేసును త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఇరు పక్షాలు తమ వాదనలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించింది. మధుర కేసుతో పాటు మరో రెండు పిటిషన్ లు ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది.
పిటిషనర్ల వాదనలు..
వివిధ కోర్టుల్లో మొత్తం 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై తదుపరి విచారణను నిలిపివేయాలని సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
ముస్లిం పక్షం వాదన..
దేశవ్యాప్తంగా 10 చోట్ల 18 దావాలు దాఖలయ్యాయని ముస్లిం పక్షం తెలిపింది. ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చే వరకు అన్ని కేసుల విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం వాదనలు..
ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కొత్తగా ఎలాంటి దావా వేయబోమన్నారు. పది పిటిషన్లపై న్యాయవాది రాజు రామచంద్రన్, ముస్లింపక్షం వాదనను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రైవేట్ పార్టీ వేసిన దావాపై స్టే విధించాలని ఎలా డిమాండ్ చేస్తారని తుషార్ మోహతా ప్రశ్నించారు.