పాక్ క్యాన్సర్ లాంటిది
దానికి ఆపరేషన్ ఒక్కటే మార్గం
కొందరి స్వార్థ ప్రయోజనాల వల్లే దేశం విచ్ఛిన్నం
లేకుంటే పాక్ ఎక్కడిది?
భవిష్యత్ లో పీవోకే భారత్ లో అంతర్భాగమే
కుట్రలు, కుతంత్రాలు, దురాశే దేశ విభజనకు కారణాలు
ముస్లింలీగ్ కు అడ్డుకట్ట వేయలేక చేతులెత్తేశారు
అగర్తల: దేశంలో శాంతి, సుస్థిరతలను నెలకొనాలంటే కేవలం చేతిలో మురళీ ఉంటే సరిపోదని సుదర్శన చక్రాన్ని కూడా ఉపయోగించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. త్రిపుర పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఓ కార్యక్రమంలో హింసను ప్రేరేపించే వ్యవస్థలను అణగదొక్కే విషయంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ భద్రత కోసం ఎంతోమంది తమ ప్రాణాలు త్యాగం చేస్తే స్వాతంత్ర్యం చేకూరిందని అన్నారు. అలాంటి స్వాతంత్ర్యాన్ని కొందరి స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటూ దేశాన్ని భ్రష్టు పట్టించాలని, విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేయాలన్నారు.
పాక్ చర్యలు ఆది నుంచి క్యాన్సర్ లాంటివన్నారు. దానికి ఆపరేషన్ ఒక్కటే మార్గమన్నారు. అప్పుడే సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. పాక్ కు ఆపరేషన్ చేస్తే మరిన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 1947కి ముందు దేశ విభజనకు కుట్రలు, కుతంత్రాలు, దురాశలు కారణమన్నారు. దీంతో భారతదేశ విభజన జరిగిందన్నారు. దీనిపై సరైన సమాచారాన్ని దేశ ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ఆనాడు ముస్లింలీగ్ కు అడ్డుకట్ట వేసి ఉంటే ఈనాడు పాక్ ఎక్కడిదని ప్రశ్నించారు. పీవోకే ప్రజలు వెంటనే భారత్ లో కలవాలన్న డిమాండ్ నానాటికి పెరుగుతోందన్నారు. ఒకవేళ పాక్ పీవోకే ప్రజలకు మేలు చేకూరిస్తే వారు భారత్ తో కలవాలన్న ఆకాంక్షను ఎందుకు లేవనెత్తుతారని ప్రశ్నించారు. భవిష్యత్ లో పీవోకే భారత్ లో అంతర్భాగం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ భూమిపై పాక్ ఉన్నంత కాలం మానవాళి మనుగడకు క్యాన్సర్ లా మిగిలిపోనుందని, సకాలంలో చికిత్స ఒక్కటే దానికి సరైన మార్గమని యోగి పాక్ పై నిప్పులు చెరిగారు.