లైంగికదాడి, హత్య అని ఆరోపణ?
పోలీస్ స్టేషన్ పై గ్రామస్తుల దాడి
టీఎంసీ ఎమ్మెల్యేనూ తరిమికొట్టిన గ్రామస్తులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న కుటుంబ సభ్యులు
మహిళల భద్రతలో మమత ప్రభుత్వం విఫలం
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సుకాంత్ మజుందార్
కోల్ కతా: శుక్రవారం కనిపించకకుండా పోయిన 10యేళ్ల బాలిక శనివారం ఉదయం శవమై కనిపించడంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే బాలికపై లైంగికదాడి, హత్య జరిగిందని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా గ్రామస్తులు దాడికి పాల్పడేందుకు రాగా పోలీసులు స్టేషన్ ను విడిచి పారిపోయారు.
పశ్చిమ బెంగాల్ 24 పరగణా జిల్లా జయనగర్ లో 10యేళ్ల శుక్రవారం నుంచి కనబడకుండా పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మహిస్మరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శనివారం బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబసభ్యులు గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టి వాహనాలు, సామాగ్రిని ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చుట్టుముట్టడం, ఆగ్రహంగా ఉండడంతో పోలీసులు స్టేషన్ ను విడిచివెళ్లారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించి పెద్ద యెత్తున భద్రతా బలగాలతో ఆ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు.
ఈ సందర్భంగా మహిస్మరి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. రాత్రి 9 గంటలకు బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని తెలిపారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికామన్నారు. అనుమానితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. గ్రామస్తులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవన్నారు.
విషయం తెలుసుకున్న టీఎంసీ స్థానిక ఎమ్మెల్యే గ్రామస్తులను శాంతింప చేసేందుకు వెళ్లగా గ్రామస్తులు ఆయన్ను తరిమికొట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించారు.
మండిపడ్డ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్..
బాలికపై లైంగికదాడి, హత్య ఘటనపై బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ తీవ్రంగా మండిపడ్డారు. ఘటన బాధాకరమన్నారు. టీఎంసీ పాలనలో రౌడీలు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ మహిళలు, బాలికలు సురక్షితంగా లేరని మండిపడ్డారు. సీఎం మమత మహిళలకు భద్రత కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.