పుట్టుక, చావు, బతుకు

Birth, death, life

Nov 30, 2024 - 22:34
 0
పుట్టుక, చావు, బతుకు

పుట్టుక, చావు మధ్యలో
కోర్కెల కొలిమిలో కాలడం
స్వార్థం గూట్లో బతకడం
అత్యాశల సాలెగూడు అల్లడం
ఆదాయాల గుట్ట ఎక్కడం
వాటి కోసం ఎంతకైనా శ్రమించడం, తెగించడం

పుట్టుక, చావు రెండు చుక్కలైతే
ఈసీజీ రిపోర్టులో ఎగుడు దిగుడు గీతలుగా
కొనసాగుతున్న జీవితం
వైకుంఠపాళీలో నిచ్చెనలెక్కినప్పుడు
ఎగిరి గంతేయడం, పిచ్చి కేకలేయడం
పాములు మింగినప్పుడు
ఊబిలో కూరుకుపోయినట్లు బాధపడడం
మారింది నిత్య కృత్యంగా

పుట్టుక, చావు మనదే
బతుకంతా మనదే కావాలనుకుంటున్నాం
కుటుంబ వలయం గీసుకొని కొనసాగుతున్నాం
దారిలో నడుస్తున్నప్పుడు 
వేగంగా పరిగెత్తుతున్నప్పుడు
అతివేగంగా వాహనాన్ని తోలుతున్నప్పుడు
రోడ్డుపై చిన్న అవాంతరం ఏర్పడినా
తిట్టిపోస్తున్నాం అన్యాయం అంటూ
అవినీతి, అక్రమాలంటూ సనుగుతున్నాం

పుట్టుక నీది చావు నీది
బతుకంతా దేశానికనేది ప్రచారానికే 
మనకు వర్తించదనుకుంటున్నాం
ఆస్తులు, అంతస్తులు, సౌకర్యాలు
మమతలు, మాధుర్యాలు, ప్రేమలు
అన్నీ మనవాళ్ళకే కావాలన్నదే నేటి పాలన
..........................................................


కొమురవెల్లి అంజయ్య