బీసీలకు వెనక పడ వేయబడ్డారు
Thrown back to the BCs
ఎంపీ ఈటల రాజేందర్
ఆత్మగౌరవం పైన దెబ్బకొడుతున్నారు
సపోర్ట్ లేకుండా ఎదగాలి అనే ఆలోచన రావాలి
వృత్తుల వారీగా కులాలు ఏర్పడ్డాయి
నా తెలంగాణ, హైదరాబాద్: బీసీలు అంటే వెనక పడ్డవారు కాదని.. వెనక పడ వేయబడ్డవారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టి వీరు చిన్న వారు, వెనకబడ్డ వారు, వేరే వారి సపోర్ట్ ఉంటే తప్ప ముందుకు పోరు అనే భావన మంచిది కాదన్నారు. టీ హబ్‌లో జరిగిన బీఐసీసీఐ కార్యక్రమంలో శనివారం పాల్గొని ప్రసంగించారు. పారిశ్రామిక విప్లవం మొదలు కాక ముందు మానవజాతికి అన్ని సౌకర్యాలు అందించింది ఈ వర్గాల ప్రజలే అని అన్నారు. వృత్తుల వారీగా కులాలు ఏర్పడ్డాయి తప్ప మేధస్సు, సంపద వారీగా కులాలు ఏర్పడలేదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న ఈ రోజుల్లో అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదని, తెలివి ఎవరి సొత్తు కాదన్నారు. తెలివి కులాల బట్టి రాదని, నేను హైదరాబాదులో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నవాడిని అని అన్నారు.
విశ్వకర్మ, నేత కార్మికులు అనేక రంగాల్లో ఉండే వారి మేధస్సు చూస్తుంటే అబ్బుర పరుస్తాయన్నారు. సంఘం తప్పకుండా ఉండాలని, సంఘంలో ఎదిగిన వారు, మేధస్సు కలిగిన వారు, అందరూ కలగలిపి ముందుకు పోయే పద్ధతి ఉండాలి తప్ప పేదరికం కోసం సంఘం ఉన్నట్లు నేను భావించడం లేదన్నారు. బీఐసీసీఐ ఎంత గొప్పగా ప్రయత్నం చేసిందో తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో వెళ్లలేదన్నారు. ఇది ఇలానే ముందుకు పోవాలని ఆశించారు. టెక్నాలజీ అనేది మనిషి యొక్క శ్రమను, టెన్షన్ తగ్గించి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనుకున్నాం కానీ మనిషికి పని లేకుండా చేస్తుందని అనుకోలేదని తెలిపారు. మనిషిని రీప్లేస్ చేసే టెక్నాలజీ మంచిది కాదన్నారు. ప్రపంచంలో మానవ శక్తి కలిగినటువంటి మొదటి దేశం భారత్ అని, మనిషిని సంపదగా భావించిన సమాజం ఇప్పుడు ఎందుకు భారంగా భావిస్తుందో ఆలోచన చేసుకోవాలన్నారు. అమ్మ నాన్న ఆశయాలను ఎలా నెరవేర్చాలి అనే దానితో ముందుకు వెళ్లాలని ఆలోచించాలని చెప్పారు. ఓటమి గెలుపునకు మరో మెట్టు అవుతుందని పేదరికం మీ కమిట్మెంట్‌కు ఒక మెట్టు లాగా పని చేయాలని భావిస్తున్నానని యువతకు పిలుపునిచ్చారు.