కోచింగ్​ సెంటర్​ నీటమునిగిన ముగురు​ విద్యార్థులు మృతి

14మందిని సురక్షితంగా రక్షించిన రెస్క్యూ బృందాలు ఉన్నతస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశం

Jul 28, 2024 - 13:14
 0
కోచింగ్​ సెంటర్​ నీటమునిగిన ముగురు​ విద్యార్థులు మృతి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారీ వర్షాలకు ఢిల్లీలోని ఐఏఎస్​ కోచింగ్​ సెంటర్​  బేస్మెంట్​ లో నీరు చేరి ముగ్గురు మృతి చెందగా, రెస్క్యూ చర్యల్లో 14మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఆదివారం అధికారులు ప్రకటించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి రాజేంద్రనగర్​ లోని ఐఏఎస్​ కోచింగ్​ సెంటర్​ లో భారీగా వరద నీరు చేరింది. దీంతో బేస్మెంట్​ మొత్తం నీటిలో మునిగిపోయింది. 

రాత్రి ఏడు గంటలకు నిర్వాహకులు పోలీసులకు ఫోన్​ చేయడంలో వెంటనే ఎన్డీఆర్ఎఫ్​ టీమ్​ లు రంగంలోకి దిగాయి. అర్థరాత్రి వరకు అండర్​ గ్రౌండ్​ లో నుంచి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీయగలిగారు. మరో 14 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. లైబ్రరీ నుంచి విద్యార్థులు బయటకు వస్తుండగా ఒక్కసారిగా వరదనీరు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోచింగ్​ సెంటర్​ లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో విద్యార్థులంతా కుర్చీలు, బెంచ్​ లపై నిలబడి ప్రాణాలను దక్కించుకున్నారు. స్థానికులు విద్యార్థులను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా అవి పలించలేదు. కోచింగ్​ సెంటర్​ లోని నీరు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోచింగ్​ సెంటర్​ నిర్వాహకులు, కో ఆర్డినేటర్​ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

సంఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక వాహనాలు చేరుకొని బేస్మెంట్​ లోని నీటిని బయటకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.కోచింగ్​ సెంటర్​ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మేయర్​ షెల్లీ ఒబెరాయ్​ ఎంసీడీ కమిషనర్​ ను ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల్లో డాల్విన్​ (28–కేరళ), తాన్యా సోని (25), శ్రేయ యాదవ్​ (25–యూపీ)గా గుర్తించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం ఉదయం నెవిన్​ మనోహర్​ లోహియా ఆసుపత్రికి తరలించారు.