నెరవేరుతున్న మహిళా సాధికారత లక్ష్యం

క్రీడాకారులకు చీర్​ ఫర్​ ఇండియా

Jul 28, 2024 - 13:12
 0
నెరవేరుతున్న మహిళా సాధికారత లక్ష్యం
  • మొహిదమ్​ కు గుర్తింపుపై హర్షం
  • పరి ద్వారా కళాకారులకు ప్రోత్సాహం
  • ఖాదీ ఉత్పత్తి కొనుగోళ్లు పెంచడంలో మహిళల పాత్ర కీలకం
  • డ్రగ్స్​ నుంచి విముక్తి కోసమే మానస్​ హెల్ప్​ లైన్​
  • పులుల సంరక్షణకు అటవీ పెంపకం హర్షణీయం
  • ఏక్​ పేడ్​ మా కే నామ్​ ప్రజాస్పందన అభినందనీయం
  • హర్​ ఘర్​ తిరంగాకు సిద్ధం కావాలి
  • 112వ మన్​ కీ బాత్​ ఎపిసోడ్​ లో ప్రధాని నరేంద్ర మోదీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఖాదీ ఉత్పత్తుల్లో పెరుగుదల, కొనుగోళ్లలో వృద్ధితో మహిళలకు లబ్ధి చేకూరుతుందని తద్వారా ప్రభుత్వం ఆశించిన మహిళా సాధికారత లక్ష్యం నెరవేరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం మన్​ కీ బాత్​ లో ప్రధానమంత్రి మోదీ 112వ ఎపిసోడ్​ లో దేశ ప్రజలనుద్దేశించారు.  ఒలింపిక్​ క్రీడాకారులకు మద్ధతునిస్తూ చీర్ ఫర్​ ఇండియా నినాదాన్నిచ్చారు. ఇటీవలే మ్యాథమేటిక్స్​ ఒలింపియాడ్​ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అసోంలోని మొహిదమ్​ యూనెస్కో గుర్తింపుపై వ్యాఖ్యానిస్తూ హర్షం వ్యక్తం చేశారు. 

పరి (పబ్లిక్​ ఆర్ట్​ ఆఫ్​ ఇండియా)లో చేరాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం కళాకళాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. భారత కళలకు గుర్తింపు లభిస్తుందని మోదీ తెలిపారు. అన్ని కళలను ఒకే వేదికపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసమే ఢిల్లీలోని భారత మండపాన్ని నిర్మించామని తెలిపారు. రోహ్​ తక్​ లోని మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న లక్షాధికారులుగా ఎదగడం సంతోషకరమని తెలిపారు. 

ఖాదీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ తొలిసారిగా వ్యాపారం రూ. 1.5 లక్షల కోట్లకు పెంచగలిగామని తెలిపారు.ప్రస్తుతం దేశీయ ఖాదీ ఉత్పత్తి కొనుగోళ్లలో కూడా మహిళల భాగస్వామ్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. కొనుగోళ్లను గణనీయంగా పెంచడంలో మహిళల పాత్ర కీలకంగా ఉందన్నారు. 

దేశంలో డ్రగ్స్​ మహమ్మారి బారిన పడిన వారిని సన్మార్గంలో పెట్టేందుకు మానస్​ పేరుతో ప్రత్యేక  కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. మానస్​ హెల్ప్​ లైన్​ 1933కు ఫోన్​ చేసి సలహాలు, సమాచారం పొందాలని తెలిపారు. డ్రగ్స్​ మహమ్మారికి అలవాటు పడి దాన్ని వదులుకోవాలనుకున్న వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 

సోమవారం ప్రపంచవ్యాప్తంగా పులుల దినోత్సవమని మోదీ తెలిపారు. పులులు భారతదేశ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయని తెలిపారు. పులుల సంరక్షణకు రణతంభోర్​ నుంచి మొదలైన ప్రయత్నాలు నేడు గ్రామాల్లోకి చేరి పులుల సంరక్షణ కోసం అటవీని సంరక్షించే చర్యలు చేపట్టడం హర్షణీయమని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం పులుల సంఖ్య గణనీయంగా పెరిగి ప్రపంచంలోనే 70 శాతం పులులు భారత్​ లోనే ఉన్నాయని తెలిపారు. 

పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఏక్​ పేడ్​ మాకే నామ్​ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఇండోర్​ లో ఒకే రోజు రెండు లక్షలకు పైగా మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా సెల్ఫీలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని మోదీ విజ్ఞప్తి చేశారు. 

హర్​ ఘర్​ తిరంగాతో దేశ ఐక్యతను చాటుకునే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి దేశ వాసులను ఏకం చేయగలిగామన్నారు. ఆగస్ట్​ 15 లోపు ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలన్నారు. సామాజిక మాధ్యమల్లో భారత ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ప్రజలను కోరారు. మీ సూచనలు, సలహాలు మై గవర్నమెంట్​ నమో యాప్​ లో పంపాలని ప్రధాని తెలిపారు.