షిమ్లాలో భారీ వర్షాలు 50 మంది గల్లంతు
నాలుగు మృతదేహాలు లభ్యం
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో 50 మందికిపైగా ఆచూకీ గల్లంతయ్యింది. బుధవారం అర్థరాత్రి ఒక్కసారిగా వర్షం బీభత్సం సృష్టించింది. అనిలోని నిర్మంద్, కులులోని మలానా, మండి జిల్లా తాల్తుఖోడ్, చంబా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో అనేక ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఉన్న 50 మందికి పైగా వ్యక్తులు గల్లంతయ్యారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామన్నారు. రహాదారులు, వంతెనలు, ఇళ్లు భారీ ఎత్తున దెబ్బతిన్నట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వం హిమాచల్ లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలకు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ లను రంగంలోకి దింపారు. రహదారులు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడడంతో రెస్క్యూ బృందాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.