దేశ విచ్ఛిన్నమే వారి లక్ష్యం

ప్రణాళికా బద్ధంగా ముందుకు ఇండికూటమిపై ప్రధాని మోదీ ఫైర్​

Jun 7, 2024 - 15:22
 0
దేశ విచ్ఛిన్నమే వారి లక్ష్యం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ ను విచ్ఛిన్నం చేసే ప్రక్రియను ఇండి కూటమి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. శుక్రవారం పార్లమెంటరీ నాయకుడుగా ఎన్నికైన అనంతరం సభలో ప్రసంగించారు. కానీ కూటమి నాయకుల కుట్రలను తాము సమర్థవంతంగా ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నామని మోదీ తెలిపారు. ఓ వైపు గత పదేళ్లుగా విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారత్​ కీర్తి, ప్రఖ్యాతులు, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాల గురించి తాము గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో విపక్ష నేతలు భారత్​ కీర్తి ప్రతిష్​ఠలను ఆయా దేశాల్లో వెళ్లి భంగం వాటిల్లేలా ప్రయత్నాలు ఓ ప్రణాళిక ప్రకారం సాగాయన్నారు. వీరు అణువణువునా భారత్​ పై విషం గక్కేవారన్నారు. ఇప్పటికే ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్య పూర్తి విశ్వాసాన్ని వీరు కోల్పోయారని అన్నారు. కానీ ఇకమీదట ఇలాంటి వారి ఆటలు సాగనీయబోమన్నారు. ఎవ్వరైనా సరే దేశాన్ని కించపరిచే, ప్రజాస్వామ్యాన్ని, భారత సంస్కృతి, సాంప్రదాయాలను అగౌరవపరిస్తే వారిపై చర్యలు తప్పవని మోదీ హెచ్చరించారు. 

భారత్​ వైపు ఆశగా చూస్తున్న ప్రపంచం..

ఇప్పుడిప్పుడే ప్రపంచం భారత్​ వైపు ఆశగా చూస్తోందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం వైపు ఆకర్షితమవుతోందని తెలిపారు. వీరి కుట్రల వల్ల దేశానికి నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తి అగౌర పరిచేలా ఇండికూటమి చర్యలున్నాయని మండిపడ్డారు. ఎన్నికల్లో గొడవలు సృష్టించడం, ఈవీఎం, వీవీప్యాట్​ లను ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం లాంటి చర్యలు విపక్షాలవన్నారు. కూటమిలో బలమైన పార్టీగా ప్రకటించుకున్న కాంగ్రెస్​ ఇప్పటివరకూ ప్రజాస్వామ్యంలో తిరస్కారమే లభిస్తుందన్నారు. 

తిరస్కారమే వీరికి అలవాటు..

2014, 2019, 2024లో కూడా వారికి ప్రజాస్వామ్యంలో తిరస్కారమే లభించిందన్నారు. అత్యంత తక్కువ సీట్లను సాధించారన్నారు. కూటమి మునిగిపోయే నావ అని మోదీ తెలిపారు. దేశంలోని సాధారణ పౌరుల అవసరాలు, ఆశయాలు, కలలను ఈ కూటమి పట్టించుకోవడం లేదన్నారు. అందుకే వీరికి ప్రతీసారి తిరస్కారమే శాపంలా పరిణమిస్తోందన్నారు. దేశ రాజ్యాంగ కాగితాలను సైతం చించివేసే నాయకులు ప్రజాస్వామ్యంలో ఎలా మనగలుగుతారని మోదీ ప్రశ్నించారు. 

ఇమేజ్​ ను పెంచుకునేందుకే పేరు మార్పు..

తమ ఇమేజ్​ ను పెంచుకునేందుకే యూపీఏ నుంచి ఇండి కూటమిగా పేరు సైతం మార్చుకున్నారని మండిపడ్డారు. వీరి హయాంలో అవినీతి, కుంభకోణాలు తప్పితే దేశ సంక్షేమం కోసం పాటుపడే ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా? అని ప్రశ్నించారు. 

వీరి ఆలోచనలు ఎప్పటికీ అసత్యాలే అన్నారు. అందుకే దేశంలో, ప్రపంచంలో, ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు. తమను తిడుతూ వారు పైశాచికానందం పొందుతున్నారని విమర్శించారు.  

దేశంలో పేదలను అవమానించేలా వీరి ప్రవర్తనను దేశ ప్రజలు ఏనాడో తిరస్కరించారని అయినా వీరి వక్రబుద్ధిలో ఏ మాత్రం రాకపోవడం శోచనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.