మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

Nov 9, 2024 - 16:17
 0
మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వం
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారా?
కాకా కాలేల్కర్​ కమిషన్​ ను బుట్టదాఖలు చేశారు
వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కల్పనలో తాత్సారం
2017లో మోదీ ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్ల కల్పన
రాంచీ: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్​ కోరుకుంటోందని, తాము అలా జరగనీయబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. శనివారం ఝార్ఖండ్​ లోని ఛతర్​ పూర్​  ఎన్నికల సభలో ప్రసంగించారు. ఎన్నికల సభలో రాజ్యాంగం పేరుతో ఖాళీ పేపర్లను ఉపుతున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దన్నారు. బీజేపీ ఉన్నంతకాలం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. మహారాష్ర్టలో ఉలేమాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్​ చేస్తున్నారని, 10 శాతం రిజర్వేషన్లు ఎవరికి తగ్గిస్తారని? నిలదీశారు. ఓబీసీలకు వ్యతిరేక పార్టీ హస్తం అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పుడల్లా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. 1950లో కాకా కాలేల్కర్​ కమిషన్​ ఏర్పాటు చేసి దాని నివేదికను కాంగ్రెస్​ బుట్టదాఖలు చేశాయని మండిపడ్డారు. వారి సంక్షేమం కోసం మండల్​ కమిషన్​ ఏర్పాటు చేస్తే ఇందిరా, రాజీవ్​ లు కమిషన్​ ను వ్యతిరేకించారని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంలో తాత్సారం చేశారన్నారు. 2017లో ప్రధాని మోదీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగాలు, పరీక్షల్లో వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్​ కల్పించిందని స్పష్టం చేశారు. కమిషన్​ కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు కృషి చేశామన్నారు. 
 
అవినీతిపరులకు కటకటాలే..
జేఎంఎం, కాంగ్రెస్​, ఆర్జేడీలు నిరుపేదల సొమ్ము దోచుకుతిన్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ ఎంపీ ఇంట్లో రూ. 300 కోట్ల స్వాధీనమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ డబ్బంతా ఝార్ఖండ్​ లోని నిరుపేదలదని తెలిపారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారిని కటకటాల వెనక్కు నెడతామన్నారు. అభివృద్ధిని తీసుకువచ్చే హై టెన్షన్​ లైన్​ వంటిది బీజేపీ అని ఝార్ఖండ్​ లోని కూటమి పార్టీలు కాలిపోయిన ట్రాన్స్​ ఫార్మర్లన్నారు. 
 
నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై బూటకపు హామీలు..
నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హేమంత్ సోరెన్ యువతకు హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. యేటా లక్ష ఉద్యోగాలు, 2 లక్షల 87 వేల ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని బూటకపు హామీలిచ్చారని మండిపడ్డారు. బీజేపీ ఏర్పడ్డాక చొరబాటుదారుల పనిపడతామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన లభించేలా చర్యలు చేపడతామన్నారు. గిరిజన భూములను తిరిగి వారికే అప్పజెబుతామన్నారు. 
 
కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం- అమిత్‌ షా..
ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు చెబుతున్నాయని అమిత్ షా అన్నారు. కానీ రాహుల్ గాంధీ, మీ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేదా? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని తేల్చి చెప్పారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఝార్ఖండ్​ కు 84వేల కోట్లు ఇచ్చిందన్నారు. ప్రజల సొమ్మును కాంగ్రెస్​, జేఎంఎంలు కలిసి తిన్నాయని ఆరోపించారు. 
 
ఝర్ఖండ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో దశలో నవంబర్ 20న 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న రానున్నాయి.