ఎన్డీయే విజయంలో మోదీదే కీలకపాత్ర
రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ గత మూడు నెలల నుంచి నిద్దుర పోకుండా ఎన్డీయే భాగస్వామ్య పార్టీల విజయానికి అన్నీ తానై నిలిచారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అందుకే భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్డీయే విజయం సాధించిందన్నారు. ప్రధాని మోదీ పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నికైన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. మోదీ నేతృత్వంలోనే అద్భుతమైన విజయం, మెజార్టీలు సాధ్యపడ్డాయన్నారు. ఏపీలో మూడు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించి తమ విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ అభివృద్ధికి మోదీయే కారణమన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కోసం అహర్నిశలు పనిచేశారని తెలిపారు. మోదీ అభివృద్ధి విధానానికి తాము కట్టుబడి ఉన్నామని ఎన్డీయేతో కలిసి నడుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మోదీ విజన్, ఉత్సాహం ఉన్న నాయకుడని తెలిపారు. ఆయన నిబద్ధత గల వ్యక్తి అని తెలిపారు. భారత్ కు మరోమారు స్పిరిట్ ఉన్న నాయకుడు దక్కడం దేశ ప్రజల సౌభాగ్యమని చంద్రబాబు కొనియాడారు.