నైనిటాల్ అగ్నిప్రమాదం చర్యలపై ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్నలు
కృత్రిమ వర్షాలపై ఆధారపడొద్దన్న సుప్రీం పరిస్థితిని వివరించిన అడ్వకేట్ జనరల్ సేథీ
నైనిటాల్: ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అడవులు తగలబడటంపై దాఖలైన పిటిషన్ పై బుధవారం సుప్రీం విచారణ చేపట్టింది. వర్షాలు, కృత్రిమ వర్షాలపై ఆధారపడవద్దని ప్రభుత్వానికి సూచించింది. వీలైనంత త్వరగా అటవులను కాపాడే చర్యలను తీసుకోవాలని ఆదేశించింది. పిటిషన్ ను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది.
40 శాతం అడవులు మంటల్లో చిక్కుకున్నాయనేది వాస్తవమేనా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది డిప్యూటీ అడ్వకేట్ జనరల్ జతీందర్ కుమార్ సేథీ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్మీ సహకారం కూడా తీసుకున్నామని వివరించారు. హెలికాప్టర్లతో కూడా నీటిని వెదజల్లుతున్నామన్నారు. ఎప్పకప్పుడు మంటలను ఒకపక్క ఆర్పివేస్తూనే కొత్త ప్రాంతాలకు పాక కుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.0.1 శాతం అటవీ ప్రాంతం మంటల్లో ఉందని పేర్కొన్నారు. అది కూడా త్వరలోనే ఆర్పేందుకు ప్రత్యేక బృందాల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు విన్నవించారు.
అగ్నిప్రమాదం వల్ల 11 జిల్లాలు ప్రభావితం అయ్యాయి. ఐదుగురు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటివరకు 1216 హెక్టార్ల అటవీ అగ్నికి ఆహుతైంది.
ఏప్రిల్ మొదటి వారంలో మొదలైన మంటలు కాస్త రోజురోజుకు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.