అవినీతిపై యుద్ధం ఆగదు

చిట్​ చాట్​ లో ప్రధాని మోదీ

Apr 12, 2024 - 13:17
 0
అవినీతిపై యుద్ధం ఆగదు

న్యూఢిల్లీ: అవినీతిపై యుద్ధం ఆగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశాన్ని దోచుకుతిన్న అవినీతిపరులతో సొమ్మునంతా కక్కిస్తామని అన్నారు. అక్రమార్కుల భరతం పడతామని స్పష్టం చేశారు. మీడియాతో చిట్​ చాట్​ లో శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ మాట్లాడారు. డైరెక్ట్​ బెనిఫిట్​ ట్రాన్స్​ ఫర్​ (డీబీటీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులను 10 కోట్ల మందికి పైగా నకిలీ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వెంటనే వారందరినీ తొలగించామని స్పష్టం చేశారు. దీంతో రూ. 2.75 లక్షల కోట్లు ఆదా చేయగలిగామని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటం దేశ క్షేమం కోసమే అని తెలిపారు. అవినీతి చెదలును తొలగించి దేశాన్ని కాపాడుకుంటామని మోదీ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులకు సంబంధించి 3 శాతం కేసులపైనే ఈడీ చర్యలు తీసుకుందన్నారు. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా అది దేశాన్ని, వ్యక్తులపై ప్రభావం చూపుతుందన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం వాడాల్సిన డబ్బు తమ ఖాతాల్లో వేసుకుంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం నరేంద్ర మోదీది కాదని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అవినీతిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చూసేవారి దృష్టికోణం సరిగ్గా ఉంటే అవినీతిపై ఎవరెవరిపై చర్యలు తీసుకుంటున్నామనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందాలనే ఉద్దేశం తమదని ప్రధాని మోదీ వివరించారు. 

అప్పుడు రూ. 34 లక్షలు.. ఇప్పుడు రూ. 2200 కోట్లు! అవినీతి సొమ్ము!

2014కు ముందు ఈడీ కేవలం రూ. 34 లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకోగా తమ ప్రభుత్వ హయాంలో ఈడీ రూ. 2200 కోట్లను స్వాధీనం చేసుకోవడం చిన్న విషయం ఏం కాదన్నారు. అవినీతిపరుల కోటలు బీటలు వారుతున్నాయని పేర్కొన్నారు. ఈ డబ్బుతో యువత సంక్షేమం కోసం ఖర్చుపెడితే ఇప్పటివరకూ ఎంత మేలు జరిగేదో ఆలోచించాలని తెలిపారు. 

దేశ క్షేమమే బీజేపీ లక్ష్యం..

బీజేపీ దేశ ప్రయోజనాలు, గౌరవ మర్యాదలు, సంస్కృతి, సాంప్రదాయాలు, నిరుపేదలు, దళితులు, గిరిజనుల అభివృద్ధ్యే ధ్యేయంగా ముందుకు వెళుతోందన్నారు. అదే సమయంల ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమన్నారు. గత పదేళ్లలో ట్రైలర్​ మాత్రమే చూపించామని మున్ముందు మరిన్ని చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకోబోతున్నామని మోదీ స్పష్టం చేశారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో కాంగ్రెస్​..

కాంగ్రెస్​ పార్టీ దేశహితానికి ఏమీ చేలేదన్నారు. పైగా శత్రుదేశాల బెదిరింపులకు తలవంచిందన్నారు. దీంతో ఉగ్రవాదం పెరిగిందని తెలిపారు. దేశంలో నిత్యం  ఏదోచోట అశాంతి, దాడులు జరిగేవని మోదీ తెలిపారు. దేశ కీర్తి, గౌరవాలను ఎన్నడూ పట్టించుకోని పార్టీ హస్తం పార్టీ అని విమర్శించారు. నిరుపేదల సంక్షేమాన్ని పూర్తి విస్మరించారని తెలిపారు. అదే సమయంలో మత విశ్వాసాలను దెబ్బతీస్తూ దేశాన్ని మరోమారు విచ్ఛిన్నం చేసే కుట్రలను కాంగ్రెస్​ చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.