రైల్వే చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​

Dec 11, 2024 - 18:38
 0
రైల్వే చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ‘రైల్వే చట్ట సవరణ 2024’ బిల్లుకు పార్లమెంట్​ లో మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. 1989 రైల్వే చట్టాన్ని సవరించింది. బుధవారం బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ పార్లమెంట్​ లో మాట్లాడుతూ గత పదేళ్లలో రైల్వేలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామన్నారు. రైళ్లలో 10వేలకు పైగా కొత్త టాయిలెట్లను ఏర్పాటు చేశామని పారిశుధ్యాన్ని మెరుగుపరిచామన్నారు. సమాజంలోని మధ్యతరగతి, పేద వర్గాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సరసమైన ప్రయాణాలను అందించడానికి వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ వంటి అనేక కొత్త రైళ్లను ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. వందే భారత్ రైలును ప్రశంసించిన మంత్రి, దాని సాంకేతికతలు, డిజైన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక అద్భుతమైన ఉదాహరణ అని అన్నారు. గడచిన పదేళ్లలో 10 ఏళ్లలో 44 వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌లు విద్యుదీకరించబడ్డాయని, ఇది 2014 వరకు 21 వేల కిలోమీటర్లు మాత్రమేనని మంత్రి చెప్పారు.

రైల్వేలకు బడ్జెట్ కేటాయింపులు విపరీతంగా పెరిగాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల 52 కోట్ల రూపాయలకు చేరుకుందని వైష్ణవ్ చెప్పారు. రైల్వేల ప్రైవేటీకరణపై ఉన్న భయాందోళనలపై మంత్రి స్పందిస్తూ, ఇది బూటకపు కథనమని, అలాంటి ప్రణాళిక లేదన్నారు. భద్రతా సమస్యపై, భద్రతా యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. రైళ్లలో యాంటీ కొలిజన్ డివైజ్ కవాచ్‌ను అమర్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. రైల్వేలో వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, పేపర్ లీకేజీలు, వ్యత్యాసాల గురించి ఎలాంటి ఫిర్యాదు లేదని మంత్రి తెలిపారు.

రైల్వేలో ఖాళీగా ఉన్న 58,642 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 4,11,000 మందికి రైల్వేలో ఉద్యోగాలు లభించాయని, మోదీ ప్రభుత్వంలో కేవలం పదేళ్లలో 5,02,000 మంది యువత రైల్వేలో ఉద్యోగాలు పొందారని వైష్ణవ్ అన్నారు.