రాష్ట్రం పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
నా తెలంగాణా, నిర్మల్: స్వరాష్ట్రం సిద్ధించి దశాబ్దం పూర్తయిందని, రాష్ర్ట పునర్నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో, గాంధీ పార్క్ లో, ట్యాంక్ బండ్ లో మూడు చోట్లా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలేటి మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివన్నారు. పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్రం కోసం బీజేపీ ఇచ్చిన సహాకారం ఫలితంగా అమరుల త్యాగాలకు ఫలితం చేకూరిందన్నారు. వారి స్ఫూర్తితో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్, బీజేపీ టౌన్ అధ్యక్షులు సాదం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.