బిట్ కాయిన్ కేసుపై ఈడీ నజర్

జిల్లా పోలీసులకు లేఖ.. ప్రమేయం ఉన్న వారి గుండెల్లో పెరిగిన దడ.. నిర్మల్​ లోనే రూ. 200 కోట్ల లావాదేవీలు?

Oct 11, 2024 - 18:46
 0
బిట్ కాయిన్ కేసుపై ఈడీ నజర్
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లాలో కొందరు ప్రభుత్వోద్యోగులు బిట్ కాయిన్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న కారణంగా అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు సస్పెండ్ అయ్యారు. ఈ అంశంపై ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ) నిర్మల్ పోలీసు అధికారులకు లేఖ రాసినట్లు శుక్రవారం విశ్వసనీయంగా సమాచారం అందింది. దీంతో నిర్మల్ జిల్లాలో ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారి గుండెల్లో మళ్లీ దడ మొదలైంది. 
 
ప్రధానంగా ఈ వ్యవహారంలో నిందితులకు కొమ్ముకాసిన జిల్లాస్థాయి అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది. జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఈ వ్యాపారంలో పాలుపంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన బిట్ కాయిన్ వ్యాపారం పెద్ద మొత్తంలో నిర్మల్ జిల్లాలో జరిగింది. ఈ వ్యవహారంపై నిర్మల్ పోలీసులు దృష్టి సారించి గత నెలలో కేసులు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో పరిస్థితి కొంత సద్దు మణిగింది. 
 
జిల్లా పరిధిలో సుమారు రూ.200 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వ్యాపారం జరగడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం వల్ల పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. బిట్ కాయిన్ వ్యవహారంపై  పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కేసు వివరాలు ఇవ్వాల్సిందిగా నిర్మల్ పోలీసులకు లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ నివేదిక, బిట్ కాయిన్ వ్యవహారంలో పాల్గొన్న వారి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి  పంపించాలని ఈడీ లేఖలో కోరింది. దీంతో పోలీసులు బిట్‌కాయిన్‌కు సంబంధించిన కేసు వివరాలను ఈడీకి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు శాఖ తో పాటు వ్యవహారంతో ప్రమేయం ఉన్న అధికారులు, ఉద్యోగులు అలెర్ట్ అవుతున్నారు.