నిర్మల్​ ను మాదక ద్రవ్య రహిత జిల్లాగా రూపుదిద్దుతా

కలెక్టర్ అభిలాష అభినవ్

Jun 26, 2024 - 17:51
 0
నిర్మల్​ ను మాదక ద్రవ్య రహిత జిల్లాగా రూపుదిద్దుతా

నా తెలంగాణ, నిర్మల్: జిల్లాను మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.  ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆమె పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాలు లేని జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతకు కుటుంబ సభ్యులు అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. యువత మత్తు పానీయాలు, సిగరెట్లు, గుట్కాలు, గంజాయి వంటి వాటికి అలవాటు పడి తమ విలువైన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. 

ఎస్పీ షర్మిల మాట్లాడుతూ పౌరులు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా మాదక దవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు గుర్తించి ఉక్కు పాదం మోపుతామన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మినా, సరఫరా చేసినా  పోలీస్ శాఖ నెంబర్ 8712671111, టోల్ ఫ్రీ నెంబర్ 14446కు సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనను తమ బాధ్యతగా భావించి చదువుకునే యువత మత్తుకు బానిస కావద్దని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.