చండీగఢ్: పని చేయొద్దు, పని చేయనీయొద్దనేదే కాంగ్రెస్ పార్టీ సూత్రమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. హరియాణా తనకు కష్టపడి పనిచేయడం నేర్పిందన్నారు. కష్టపడి పనిచేయడంతోనే బీజేపీ సత్ఫలితాలు సాధ్యపడుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మంగళవారం హరియాణాలోని గడ్ఫురి టోల్ బారియర్ వద్ద ఎన్నికల సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికలలో ఇదే తన చివరి సమావేశం అవుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్ధానాలకే పరిమితం అవుతుందన్నారు. హరియాణాలో సాధారణ పౌరుల్లో కష్టపడే తత్వం ఎక్కువని తెలిపారు. ఈ విషయాన్ని తాను వెళ్లిన ప్రతీచోటా గమనించానని తెలిపారు. రాష్ర్టంలోని అన్ని వర్గాలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకోగలిగానని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో తమ అభీష్టం సిద్ధించేందుకు ప్రతీఒక్కరూ ఓటింగ్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అక్కడ ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందన్నారు. సభకు విచ్చేసిన మీలోని ఉత్సాహం చూస్తుంటే హరియాణా ఎన్నికల ఫలితాలు ఇట్టే అర్థం అయిపోతున్నాయని తెలిపారు. సదా మీ దీవెనలు తన, పార్టీ వెంట ఉండాలని ప్రధాని కోరారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే హరియాణాలో విజయం సాధిస్తుందని తెలిపారు. ఇది హరియాణా ట్రాక్ రికార్డు అని తెలిపారు. ఢిల్లీలో మూడోసారి అధికారం ఇచ్చారని, ఇప్పుడు హరియాణాలో కూడా మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.
హరియాణా ఎన్నికల్లో బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.