18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ సదస్సులో ప్రధాని మోదీ
జర్మనీతో వ్యూహాత్మక బంధాలకు 25యేళ్లు పూర్తి
ప్రపంచంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అందరూ ప్రయత్నించాలి
భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది: జర్మన్ చాన్స్ లర్ ఒలాఫ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతీయ వార్షిక వీసాల కోటా పెంపుతో భారత్ – జర్మనీల మధ్య బంధాలు మరింత గట్టి పడనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూ ఢిల్లీలో శుక్రవారం జరిగిన 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్నన్ బిజినెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చర్చల సారాంశాన్ని వివరించారు. భారతీయుల వార్షిక కోటాను జర్మనీ 20 నుంచి 90వేలకు పెంచడం సంతోషకరమని ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇరుదేశాల మధ్య ఆర్థిక బంధం కూడా బలోపేతం అవుతుందని ఆకాంక్షను ప్రధాని మోదీ వ్యక్తం చేశారు.
సుస్థిరతకు ఇండోపసిఫిక్ ల సత్సంబంధాలు కీలకం..
ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనేవి దేశ ఆర్థిక స్థితి, అభివృద్ధికి మూలస్తంభాలని తెలిపారు. భారత్–జర్మనీల వ్యూహాత్మక బంధాలకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇరుదేశాలు వైవిధ్యం, ప్రమాదాల నివారణ, సమస్యల పరిష్కారంలో ముందున్నాయని తెలిపారు. ప్రపంచ సుస్థిరత భవిష్యత్తుకు ఇండోపసిఫిక్ ప్రాంతంలో చాలా ముఖ్యమైనవని అన్నారు.
యుద్ధాలకు భారత్ వ్యతిరేకమే..
ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అన్ని దేశాలు ప్రయత్నించాలని తెలిపారు. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–గాజా, లెబనాన్ లలో ఉద్రిక్తతలు తగ్గించే చర్యలకు మార్గాలను అన్వేషించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచంలో అనిశ్చిత, యుద్ధ పరిస్థితులకు వ్యతిరేకమని పునరుద్ఘాటించారు.
భారత ఆర్థికం భేష్..
ఈ సందర్భంగా జర్మన్ చాన్స్ లర్ ఒలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ.. భారత్ అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో వేగంగా విస్తరిస్తున్న దేశం కూడా భారత్ అన్నారు. అందుకే జర్మనీ భారత్ తో కలిసి మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటుందని ఒలాఫ్ తెలిపారు.