నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–జమైకా భాగస్వామ్యాలు చరిత్ర, ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం జమైకా ప్రధాని ఆండ్రూ హోల్ నెస్, ప్రతినిధి బృందంతో ఇరుదేశాల మధ్య పలు రంగాలపై ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జమైకా ప్రధాని భారత్ రావడం సంతోషకరమన్నారు. ఈ పర్యటన ఇరుదేశాల బంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు.
జమైకాతో అనుబంధానికి భారత్ సిద్ధం..
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, చిన్న తరహా పరిశ్రమలు, జీవ ఇంధనం, ఆవిష్కరణలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలలో జమైకాతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. రక్షణ రంగంలో జమైకన్ ఆర్మీకి శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారతదేశం ముందువరుసలో ఉందన్నారు. వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ, ఇవి సాధారణ సవాళ్లని, ఈ సవాళ్లను కలిసి ఎదుర్కొనేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ప్రధాని చెప్పారు.
శాంతి, సుస్థిరతలకు ప్రయత్నం..
ప్రపంచ శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ఇరుదేశాలు తమవంతు ప్రయత్నాలను కొనసాగించాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా అన్ని ప్రపంచ సంస్థలలో సంస్కరణలు అవసరమని భారతదేశం, జమైకా ఉమ్మడి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.
ఢిల్లీలో జమైకా మార్గ్..
న్యూఢిల్లీలోని జమైకా హైకమిషన్ ఎదురుగా ఉన్న రహదారికి 'జమైకా మార్గ్' అని పేరు పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇరుదేశాలు భౌగోళికంగా దూరంగా, వేర్వేరుగా ఉన్న, ప్రజలు, మన సంస్కృతి, మన చరిత్ర ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు.
తమదైన ముద్రవేసిన భారతీయులు: ఆండ్రూ..
అనంతరం జమైకా ప్రధాని ఆండ్రూ హోల్ నెస్ మాట్లాడుతూ.. భారత్ తో బలమై సోదర బంధాలు విలువైనవని అన్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా జమైకాలో ఉన్న భారతీయులు తమదైన ముద్రవేశారని ఆండ్రూ తెలిపారు. ఆరోగ్యం, విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వ్యాపారంతో సహా వివిధ రంగాలలో జమైకా అభివృద్ధికి తోడ్పడుతున్నారని ఆండ్రూ భారతీయులను కొనియాడారు.