లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం 

కలెక్టర్ అభిలాష అభినవ్

Sep 1, 2024 - 17:44
 0
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం 
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పడికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిఎన్ ఆర్ కాలనీలో కలెక్టర్ ఆదివారం
పర్యటించారు. 
 
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాజెక్టులు, చెరువులు, కుంటలలో వరద నీటి నిల్వలను ఎప్పడికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్టులో అధిక వరద నీరు చేరడం వల్ల 2 గేట్లు ఎత్తి నీటిని వదలడం జరుగుతుందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
 
ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ప్రజలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 6305646600 నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ పై సత్వరమే స్పందించాలని, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్, ఇరిగేషన్, వైద్య శాఖలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 
 
భారీ వర్షాల కారణంగా ప్రతి సోమవారం జరపాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. అలాగే జిల్లాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, డిఆర్ఓ భుజంగరావు, ఆర్డీఓ రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.