నా తెలంగాణ, ఆదిలాబాద్: ప్రజా గాయకుడు, యుద్ధ నౌక గద్దర్, జహీరోద్దీన్ ఆలీఖాన్ సంస్మరణ సభలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, గద్దర్ కూతురు వెన్నెల, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ చార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ లోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి కంది శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
కోదండరామ్, వెన్నెలకు ఘన స్వాగతం..
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతూ.. ఆదిలాబాద్ కు రావడం తమ అదృష్టమన్నారు. గద్దర్ ఆశయాలను బతికించేందుకు ఆయన కూతురు వెన్నెల రాజకీయాల్లోకి రావడం స్వాగతించాల్సిన విషయం అన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఆశయ సాధనలో కీలకమైన వ్యక్తి అని తెలంగాన జాతిపితగా అభివర్ణించారు. పెదబాపు జయశంకర్ అయితే చినబాపు కోదండరామ్ అని కొనియాడారు.
రాహుల్ సిద్ధాంతాలకు మద్ధతు: కోదండరామ్..
ప్రొఫెసర్ కొదండరామ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆదిలాబాద్ ప్రాంతం మరింత అభివృద్ధి దిశలో ముందుకు వెళుతుందన్నారు. ఇక్కడ మూతపడిన పరిశ్రమలు తిరిగి తెరుచుకొని ఉపాధి లభిస్తుందన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంభన చేకూరుతుందని తెలిపారు. రాహుల్ గాంధీ దేశానికి గొప్ప నాయకుడని కోదండరామ్ అభివర్ణించారు. ఆయన సిద్ధాంతాలకు తామంతా మద్ధతు తెలియజేస్తున్నట్లు కోదండరామ్ పేర్కొన్నారు.
రెండు ఆయుధాలు రాజ్యాంగం, ఓటు: వెన్నెల..
గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం కల్పించిన రెండు ఆయుధాలు రాజ్యాంగం, ఓటు హక్కు అని అన్నారు. దీంతో భవిష్యత్ పునాదులను పటిష్టంగా నిర్మించుకోవచ్చని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. నోటుకు ఓటును అమ్ముకోవద్దన్నారు. తన తండ్రి చివరి ఆశయాన్ని నెరవేర్చేందుకు రాజకీయాలలోకి వచ్చానని పేద, బడుగు, బలహీన వర్గాల గొంతుకైవారి పక్షాన నిలుస్తానని తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.