నా తెలంగాణ, సంగారెడ్డి: భారీ వర్షాల దృష్ట్యా సంగారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం అధికారులతో టెలి కాన్ఫరెన్ నిర్వహించారు. జిల్లాకు యెల్లో అలర్ట్ జారీ అయిందన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. వాగులు, చెరువులు, కుంటలను చూసేందుకు వెళ్లరాదన్నారు. జలాశయాలు నిండుకుండలా మారాయని అప్రమత్తత అవసరమన్నారు. అత్యవసర సమయంలో స్థానిక పోలీసు స్టేషన్ కు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739ను సంప్రదించాలన్నారు.
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, జిల్లా పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. చెరువులు, కుంటల వద్ద ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలెవ్వరూ వాటి వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎస్పీ రూపేష్ సూచించారు. రైతులు పొలాల వద్ద మోటార్ల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు.