విపక్షాలవి రాద్ధాంతాలే!

జబ్బుపడ్డ వారందరికీ ఉచిత వైద్యం అన్ని శాఖల అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం

Sep 4, 2024 - 18:17
 0
విపక్షాలవి రాద్ధాంతాలే!
నా తెలంగాణ, మెదక్​: రాష్ట్రంలో జబ్బు పడ్డ వారందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్​ ప్రభుత్వమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. తమ పాలనపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ విపక్షాలు రాద్దాంతాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
బుధవారం మెదక్​ లోని కలెక్టర్​ కార్యాలయ సమావేశ మందిరంలో విద్య, ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్, వ్యవసాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, అభయ హస్తం, ఆర్టీసీ  శాఖలపై జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. భూ పరిష్​కారాలకే గ్రామస్థాయి రెవెన్యూ సదస్సు నిర్వహించి సమస్యలను పరిష్​కరించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాలయాలు, రెసిడెన్షియల్​ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే వాటిని పరిష్​కరించాలని సూచించారు. మెదక్​ ప్రభుత్వాసుపత్రిలో 30 రోజుల్లో సిటీస్కాన్​ సెంటర్​ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో ట్రామా, డయాలసిస్​ సెంటర్లు ఏర్పాటు చేసి ఆసుపత్రుల్లో బెడ్లను పెంచుతామన్నారు. నూతనంగా మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాలని అధికారులకు సూచించారు. పారిశ్రామిక వేత్తలు తమ వంతు బాధ్యతగా విద్యను ప్రోత్సహించేందుకు విరివిగా నిధులను కేటాయంచాలని విజ్ఞప్తి చేశారు. సీజనల్​ వ్యాధులపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు నిరంతరంగా అవగాహన కల్పించాలని, దోమల వ్యాప్తిని అరికట్టాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. 
 
మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. పారిశుద్ధ్యం, దోమల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. 
 
దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లోని విద్యార్థులకు సన్న బియ్యం భోజనం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందించి విద్యార్థుల విద్యపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. 
 
నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో నిరంతరం విద్యుత్​ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో పెండింగ్​ లో ఉన్న భవనాలను పూర్తి చేయాలన్నారు. రుణమాఫిపై విధానాన్ని స్పష్టంగా రైతులకు వివరించాలన్నారు. 
 
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో భూ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలన్నారు.
 
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ..మంత్రులు, శాసనసభ్యులు ఇచ్చిన సూచనలు, సలహాలు, ఆదేశాలను అధికారులంతా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్నారు. 
 
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లాలో ధరణి పెండింగ్ కేసుల పరిష్కారం దిశగా రోజువారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.