విచారణకు హాజరైతేనే విషయం తెలిసేది
సీఎం కేజ్రీ పిటిషన్‌పై హైకోర్టు ఏప్రిల్22కు వాయిదా
నా తెలంగాణ, ఢిల్లీ: ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) మిమ్మల్ని సాక్షిగా, నిందితుడిగా ఎందుకు పిలుస్తారనే విషయం విచారణకు హజరైతే తెలుస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బుధవారం ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని గతంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించి ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ విచారణకు హాజరు కావల్సిందే అన్న కోర్టు నిర్ణయం స్పష్టమవుతోంది. ఇప్పటివరకు ఈడీ కేజ్రీవాల్‌కు 9సార్లు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఈడీ సమన్లపై కేజ్రీవాల్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని, హాజరు కావడం లేదని సింఘ్వీని ప్రశ్నించింది. తాము నోటీసులపై ఈడీకి లేఖలు రాశామన్నారు. వర్చువల్ విచారణకు సిద్ధంగా ఉన్నామన్నారు. రక్షణ విషయంలో ఈడీకి సమన్లు జారీ చేయాలని సింఘ్వీ కోర్టును కోరారు. హైకోర్టులో విచారణ అనంతరం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ దరఖాస్తుపై న్యాయస్థానం జరిపిన ప్రాథమిక విచారణలో ఈడీ సమన్లన్నీ చెల్లుబాటు అయ్యేవని స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. ఈడీ విచారణ నుంచి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు.