మహిళా సాధికారతే లక్ష్యం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ఐక్యరాజ్యసమితి మహిళల స్థితిగతుల 68వ వార్షిక సమావేశంలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్
నా తెలంగాణ, ఢిల్లీ: మహిళా సాధికారతతోనే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత మిషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించింది. ఇందులో మహిళల స్థితిగతులపై చర్చించారు. మహిళల స్థితిగతులపై 68వ వార్షిక సమావేశం మార్చి 11న ప్రారంభమైంది, మార్చి 22 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా భారత ప్రతినిధి కాంబోజ్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు సంబంధించి భారతదేశం అనేక చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. సమాజంలో లింగ సమానత్వంపై వ్యాఖ్యానించారు. మహిళల కోసం భారత్ బహుముఖ వ్యూహాన్ని సిద్ధం చేసిందన్నారు. ఆరోగ్యం, భద్రత, ఉపాధి రంగాల్లో మహిళలను మరింత ప్రోత్సహించేలా కృషి చేస్తున్నదని కాంబోజ్ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యానికి భరోసా ఇస్తున్నామని స్పష్టం చేశారు. జీ–20 అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా, మహిళా సాధికారతలో కొత్త శకం ప్రారంభమవుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.