మోదీ భూటాన్​ పర్యటన చైనాకు కలవరపాటు

మార్చి 21, 22న పర్యటన షెడ్యూల్​ విడుదల

Mar 20, 2024 - 16:40
Mar 20, 2024 - 18:42
 0
మోదీ భూటాన్​ పర్యటన చైనాకు కలవరపాటు

నా తెలంగాణ, ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు భూటాన్​లో పర్యటన చైనాకు కలవరపాటుకు గురి చేస్తోంది. బుధవారం పీఎంవో వర్గాలు మోదీ పర్యటన షెడ్యూల్​ను విడుదల చేశాయి. మార్చి 21, 22వ తేదీల్లో భూటాన్​లో పర్యటించనున్నట్లు వెల్లడించింది. రాజు జిగ్మేఖేసర్​ నామ్​గేల్​వాంగ్​చుక్ ను కలవనున్నారు. భూటాన్​ ప్రధాని షెరింగ్​ టోబ్‌గేను కూడా ప్రధాని మోదీ కలవనున్నారు. ఇరుదేశాల మధ్య నైబర్​ ఫస్ట్​ పాలసీ నేపథ్యంలో పలు ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. భూటాన్​భారత్, చైనాలకు సరిహద్దు దేశం. చైనా అనేకమార్లు భూటాన్​ను మచ్చిక చేసుకుందామని చూసినా ఆ దిశగా మళ్లలేదు. మరోవైపు భూటాన్​పై చైనా జోక్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో భారత్​ ఆది నుంచి భూటాన్​కు మిత్ర దేశంతోపాటు విశ్వసనీయత, నమ్మకాన్ని కలిగి ఉన్న దేశంగా ఉండడంతో భారత్​తోనే ఎక్కువ సంబం, బాంధవ్యాలను నెరిపేందుకు భూటాన్​ ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే భూటాన్​ప్రధాని షెరింగ్​ ఐదు రోజుల భారత పర్యటన నిమిత్తం కూడా వచ్చారు. ప్రధానిని భూటాన్​కు ఆహ్వానించారు. 2014 ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక భూటాన్​తొలి పర్యటన కావడం విశేషం. 

మైత్రి బంధం బలోపేతం దిశగా అడుగులు..

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, కనెక్టివిటీ, ఎనర్జీ, జలవిద్యుత్ సహకారం, ప్రజల మధ్య మార్పిడి, అభివృద్ధి సహకారం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరుదేశాల నేతలు మరోమారు సమీక్షించనున్నారు. మరోవైపు మనదేశంలో కొనసాగుతున్న విద్య, వైద్య రంగాలపై భూటాన్​ అత్యంత ఆసక్తిని కనబరుస్తోంది. ఇటీవలే భూటాన్​ ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు తమదేశంలో విద్య, వైద్యం బలోపేతం దిశగా చర్యలు తీసుకోవడంలో భారత్​ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 

చైనాతో భూటాన్​ వివాదం? 

గతంలో భూటాన్​ చైనాతో చేసుకున్న ఒప్పందాల నేపథ్యంలో సరిహద్దు రోడ్​ మ్యాప్​పై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ప్రస్తుతం ఏకాభిప్రాయానికి వచ్చిన వాటితోబాటు భూటాన్ చెందిన సరిహద్దు ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ చైనా 83 కిలోమీటర్ల ప్రాంతంలో పలు పనులను చేసేందుకు పూనుకుంది. దీన్ని భూటాన్​ఖండిస్తూ అంతర్జాతీయ సమాజం ముందు చైనా చర్యలను ఎండగట్టింది. ఇదే సమయంలో భారత్​ భూటాన్​కు పూర్తి మద్దతును కూడా ప్రకటించింది. 

అసోం నుంచి భూటాన్​ సరిహద్దు వరకు పలు ప్రాజెక్టులను, కారిడార్​లను, రహదారులను నిర్మిస్తే భారత్, భూటాన్​ల మధ్య మరింత వేగంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాగనున్నాయి. ఇది కాస్త చైనాకు ఇష్టం లేదు. నయానో భయానో భూటాన్​ లాంటి చిన్న దేశాలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనలో ఈ ప్రాజెక్టులపై ఒప్పందాలు పూర్తి అయితే చైనాకు మింగుడు పడని అంశంగా మారనుంది. అందుకే చైనాలో కలవరపాటు మొదలైంది.