జైపూర్: హెచ్ సీఎల్ (హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్) చొరవతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ ఆర్) చొరవతో ఏర్పాటైన ఆరోగ్య కేంద్రం కార్మికుల, స్థానికుల ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపరుస్తుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం రాజస్థాన్ లోని ఖేత్రినగర్ గోత్రాలో ఉన్న హెచ్ సీఎల్ సీఎస్ ఆర్ కింద నిర్మించిన ఆరోగ్య కేందాన్ని సందర్శించేందుకు రాజస్థాన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధిలు, సంస్థ సీనియర్ అధికారులు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తొలుత కోలిహన్ గనుల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థ ఆరోగ్య కేంద్రంలోని వెయిటింగ్ హాల్ ను ప్రారంభించారు. సంస్థ ఆధ్వర్యంలో అందుతున్న ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. అధికారులతో కలిసి గనుల ప్లాంట్‌ను సందర్శించారు. సంస్థకు సంబంధించిన కార్మికుల రక్షణ కోసం రూపొందించిన వాహనాలను పరిశీలించారు. ప్లాంట్ లోని కార్మికులు, అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే సంస్థలోని గనులకు సంబంధించిన ఉత్పత్తి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని ఫ్లోచార్ట్ ను పరిశీలించారు.
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కోలిహాన్ గనులు రాగి నిల్వల లబ్ధిలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మరింత ఉత్పత్తి పెంచేందుకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీసుకుంటున్న చొరవ, చర్యలు మరింత ఉత్పత్తి పెరిగేందుకు కారణమవుతుండడంతోపాటు, కార్మికుల సంక్షేమం, ఆరోగ్యంపై తీసుకుంటున్న చొరవ ప్రత్యేకమైనదిగా అధికారులు హర్షం వ్యక్తం చేసి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.