మతమార్పిడుల్లో విదేశీ శక్తులు

తెలిసినా చేతులెత్తేసిన గత ప్రభుత్వం.. ప్రధాని నేతృత్వంలో పటిష్ఠ చట్టం హర్షణీయం రాజస్థాన్​ స్పీకర్​ వాసుదేవ్​ దేవ్​ నానీ

Feb 25, 2024 - 16:38
 0
మతమార్పిడుల్లో విదేశీ శక్తులు

జైపూర్​: రాజస్థాన్​ లో మతమార్పిళ్ల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని,ఇది తెలిసినా గత గెహ్లాట్​ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ రాష్ర్ట స్పీకర్​ వాసుదేవ్​ దేవ్​ నానీ మండిపడ్డారు. తొలిసారిగా మతమార్పిడులపై చట్టం చేసేందుకు వసుంధర రాజే నేతృత్వంలో చర్యలు తీసుకున్నామన్నారు. 

బార్మర్ పర్యటనలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ ఆదివారం మతమార్పిళ్లపై మీడియాతో మాట్లాడారు. విదేశీ శక్తులు హిందూమతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈ శక్తులు నిరుపేదలైన గిరిజన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని వారితో మతమార్పిడి చేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మతమార్పిళ్లపై కఠినచట్టాలను కేంద్రం తీసుకురావడం హర్షణీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ చట్టాన్ని పదునెక్కించడం అభినందనీయమన్నారు. యూపీలో ఇటీవలే 400కు పైగా మతమార్పిడులు చోటు చేసుకుంటే అక్కడ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్పష్టం చేశారు. 

ఖజూరి గ్రామ పాఠశాలలో మత మార్పిడి ఘటనపై దేవ్​ నానీ స్పందించారు. మతమార్పిడికి పాల్పడేవారు ఉపాధ్యాయుల రూపంలో ఉండడం చింతాకరమైన విషయమనిపేర్కొన్నారు. అభం శుభం తెలియని విద్యార్థులపై మతమార్పిళ్ల కోసం ఒత్తిడి తేవడం, వారిని శిక్షించడం ఓ రకమైన నేరప్రవృత్తికి, రాక్షసత్వానికి నిదర్శనమని దేవ్​ నానీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.