60 కోట్ల మందికి మౌలిక సౌకర్యాలు అమిత్ షా

75 యేళ్లలో చీకట్లోనే మగ్గనిచ్చారెందుకు? కాంగ్రెస్​పై మండిపడ్డ కేంద్రమంత్రి అమిత్​ షా

Mar 20, 2024 - 16:26
 0
60 కోట్ల మందికి మౌలిక సౌకర్యాలు అమిత్ షా

నా తెలంగాణ, ఢిల్లీ: 60 కోట్ల మంది నిరుపేదలకు కేవలం పదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో విద్యా, వైద్యం, నీరు, మరుగుదొడ్డి, గ్యాస్, బ్యాంకు అకౌంట్, ఉచిత రేషన్​ లాంటి మౌలిక సదుపాయాలను అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన రైజింగ్​ భారత్​ సమ్మిట్​లో షా పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు గడిచినా గత ప్రభుత్వాలు నిరుపేదలను చీకట్లోనే మగ్గనిచ్చారని దుయ్యబట్టారు. 2014 నుంచి 2024లో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి 75 యేళ్లలో జరగలేదన్నారు. వాజ్​పేయి హయాంలో 11వ ఆర్థిక శక్తిగా ఎదిగామని తెలిపారు. మన్మోహన్​సింగ్​ పాలనలో అదే స్థానంలో దేశ ఆర్థిక వ్యవస్థ కొనసాగిందని షా స్పష్టం చేశారు. కానీ ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్​ అవతరించిందని ప్రపంచమంతా మోదీ నిర్ణయాలను చూసి అవాక్కవుతున్నారని షా తెలిపారు. అదే సమయంలో ఎన్నో జఠిలమైన నిర్ణయాలను కూడా అవలీలగా తీసుకొని అమలు చేసిన ప్రభుత్వం తమదన్నారు. తీన్​ తలాక్, ఆర్టికల్​ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం లాంటి ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకొని శాంతియుతంగానే సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం నరేంద్ర మోదీదని షా అన్నారు. మరోవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపగలిగామన్నారు. దేశంలో ప్రస్తుతం ఉగ్రవాదం అనే పేరు వినబడకూడదన్నది తమ అభిమతం అన్నారు. దేశంలోని ఏ వర్గ ప్రజలైనా దేశ పురోభివృద్ధికి పాటుపడాలే తప్ప, ఉగ్రవాదం అనే హింసాయుతం వైపు మళ్లకూడదని హెచ్చరించారు. మోదీ నేతృత్వంలో శత్రుదేశాలకు భారత వైఖరిని రెండుసార్లు స్పష్టంగా తెలియజేశామని అమిత్​ షా అన్నారు.
ఎలక్టోరల్​ బాండ్లను తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలకు వస్తున్న నిధులను ప్రజలముందు పెట్టే నిర్ణయాన్ని తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీం నిర్ణయమే తుదిగా పరిగణించబడుతుందని షా పేర్కొన్నారు.  ఈ నిర్ణయం వల్ల నగదు రూపేణా వస్తున్న పార్టీ ఫండ్​లకు పూర్తిగా అడ్డు కట్ట వేయగలిగామని మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.