ఆరోగ్యం ప్రాథమిక హక్కు

అత్యవసర వైద్య సేవలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలకం  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా 

Oct 24, 2024 - 20:50
 0
ఆరోగ్యం ప్రాథమిక హక్కు
నా తెలంగాణ, సంగారెడ్డి: ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు అని, అత్యవసర వైద్య సేవలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలకని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల్లో సత్వర వైద్యానికి ఈ ఆరోగ్య కేంద్రం ఉపయోగపడుతుందని ప్రాణాలను నిలుపుతుందన్నారు. 
 
అన్ని వర్గాల ప్రజలకు సమానంగా మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, పేదవారికి ఉచిత వైద్యం అందించడంలో ఏ లోటు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ తెలిపారు.  ఆరోగ్య సంరక్షణను అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్య విద్య, పర్యావరణం, సామాజిక ఆరోగ్యం వంటి అంశాలకు తెలంగాణ ప్రభుత్వం  ప్రాముఖ్యత నిస్తుందని మంత్రి  తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ ఆరోగ్యం కాపాడుతామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. దౌల్తాబాద్ కేంద్రంలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి వీలైనంత త్వరగా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రులు పేర్కొన్నారు. 
 
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యఅధికారి గాయత్రీ, ఆర్ డి ఓ  రాజు, తహసీల్దార్ ఫరీనా షేక్, డాక్టర్ దివ్య జ్యోతి, ప్రజాప్రతినిధులు మదన్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు .