పంటల సాగుకు ఢోకా లేదు

జలకళను సంతరించుకున్న సింగూర్​ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా 

Sep 5, 2024 - 19:16
 0
పంటల సాగుకు ఢోకా లేదు
నా తెలంగాణ, సంగారెడ్డి: పంటల సాగుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. భారీ వర్షాలతో సింగూరు బ్యారేజ్ లో జలాశయ నీటి మట్టం పెరగడంతో రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టు 4, 6 నంబర్ల రెండు గేట్లను 1.50 మీటర్ల పైకెత్తి 16,284 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలామన్నారు.  ప్రాజెక్టులో 28.555 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు. ఇందులో జెన్ కో ద్వారా 2,822 క్యూసెక్కులు, రెండు గేట్ల ద్వారా  16,284 క్యూసెక్కుల నీటిని మొత్తం 19,106 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారన్నారని తెలిపారు. 
 
సింగూర్ జలకళను సంతరించుకోవడంతో ఆయకట్టు రైతాంగానికి ఏడు రెండు పంటల సాగుకు ఢోకా ఉండదని  అన్నారు. మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకుండల మారడంతో ఈ ప్రాంతమంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్కును సందర్శించారు. పార్కులో  మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు. అనంతరం బస్వాపూర్  మోడల్ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ  జన్మదినోత్సవాన్ని  పురస్కరించుకొని   మోడల్ స్కూల్  ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని తెలిపారు. నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని  మంత్రి  పరిశీలించారు . పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల  ప్రిన్సిపల్ జ్యోతి, మంత్రి దృష్టికి  తెచ్చారు. నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న  పనులు నాణ్యత పాటించి  వేగవంతంగా, పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు కె. ధర్మ, సీఈ. భీమ్, ఈఈ నాగరాజు, డీఈఈ, ఆర్డీవో పాండు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.