కంకేసంతురై ఓడరేవు ఖర్చు భారత్ దే
చైనాలో మొదలైన ఆందోళన ప్రాజెక్టు ఖర్చు 61.5 మిలియన్ డాలర్లు ఓడరేవు పున: ప్రారంభంతో ముడిపడి ఉన్న దేశ ప్రయోజనాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శ్రీలంకలోని కంకేసంతురై ఓడరేవు పున: ప్రారంభానికి అయ్యే ఖర్చును పూర్తిగా భారత్ భరించనుంది. ఇది ఆశ్చర్యం కలిగించినా ఈ ఓడరేవు ద్వారా భారత్ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. భారత్ నిర్ణయంతో చైనాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణానికి అయ్యే ఖర్చును ఓ వైపు భరిస్తూనే మరోవైపు భారత్ అన్ని రకాలుగా ఆ ఓడరేవును సైనిక అవసరాలకు సైతం వినియోగించుకోనుంది. ఇటీవల చైనా తన చుట్టుపక్క దేశాల దీవులను, ఓడరేవులలో పాగా వేస్తుండగా ఈ ఓడరేవుపై కూడా చైనా కన్నుపడింది. ఈ నేపథ్యంలో భారత్ ముందుగానే నిర్ణయం తీసుకోవడంతో చైనాకు చెక్ పెట్టినట్లయ్యింది. ఈ ఓడరేవు భారత్ కు అత్యంత సమీపంలో ఉండడం గమనార్హం.
ఉత్తర ప్రావిన్స్‌లోని కంకేసంతురై ఓడరేవును పునరుద్ధరించాలని శ్రీలంక క్యాబినెట్ నిర్ణయించింది. 61.5 మిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు కానుంది. ఈ నిర్ణయాన్ని శ్రీలంక తీసుకున్న వెంటనే భారత విదేశాంగ శాఖ అలర్టయ్యింది. వెంటనే శ్రీలంక విదేశాంగ శాఖతో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభించి ఓడరేవు ఖర్చును భరించే ఒప్పందాన్ని చేసుకుంది.
కంకేసంతురై పోర్ట్ 16 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పుదుచ్చేరిలోని కారైకాల్ పోర్ట్ నుంచి కేవలం 104 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని నాగపట్నం నుంచి జాఫ్నా సమీపంలోని కంకేసంతురై ఓడరేవుకు నేరుగా ప్రయాణీకుల ఓడల ద్వారా మూడున్నర గంటల్లో 111 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవచ్చు.
తొలుతగా 2017 మే 2న ప్రాజెక్టును ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేద్దామని నిర్ణయించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు అంచనా ఎక్కువగా ఉండడంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక కూడా ప్రాజెక్టు నిర్వహణను వాయిదా వేస్తూ వచ్చింది. తాజా నిర్ణయంతో భారత్ ముందే తమ స్వప్రయోజనాలపై ఓ కన్నేసి ఉంచింది. ఈనేపథ్యంలో ప్రాజెక్టుకు మరోమారు క్యాబినెట్ ఆమోదముద్ర పడగానే భారత్ స్పందించి ఒప్పందం చేసుకుంది. j