రాజ్యాంగానికి తలవంచుతా బతికున్నంత కాలం గౌరవిస్తా

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు యథాతథం ముస్లింల రిజర్వేషన్లు రద్దు ఖాయం యువరాజు కుటుంబం మూడు పాపాలు రాజ్యాంగాన్ని కప్​ బోర్డులో పెట్టిన హస్తం మొదటి ప్రధాని ఎమర్జెన్సీతో రెండో పాపాన్ని మూటగట్టుకున్న నాయనమ్మ స్వేచ్ఛను హరించే కుట్రకు తండ్రి తెర మూడో పాపం జహీరాబాద్​ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Apr 30, 2024 - 19:06
 0
రాజ్యాంగానికి తలవంచుతా బతికున్నంత కాలం గౌరవిస్తా
నా తెలంగాణ, జహీరాబాద్​:
తాను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని గౌరవించుకుంటానని ప్రధాని నరేంద్ర అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అదే సమయంలో మత ప్రాతిపదికన ముస్లిం వర్గాలకు లభించిన రిజర్వేషన్లను రద్దు చేసి తీరుతానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 
జహీరాబాద్​ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగించారు. కాంగ్రెస్​ చర్యలను తూర్పారబట్టారు. 
దేశానికి కాంగ్రెస్​ పార్టీ ఆది నుంచి అన్యాయం చేసిందన్నారు. యువరాజు (రాహుల్​ గాంధీ) ముత్తాత దేశ తొలి ప్రధాని (నెహ్రూ) బాబా సాహేబ్​ అంబేద్కర్​ రాసిన తొలి రాజ్యాంగ ప్రతిని కప్​ బోర్డులో పెట్టేశారని ఆరోపించారు. అసలు రాజ్యాంగంలో రామాయణం, మహాభారత వర్ణన, చిత్రాలు ఉన్నాయని తెలిపారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను కలగలిపి బాబా సాహేబ్​ రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. అందులోని అనేకాంశాలకు కాంగ్రెస్​ తొలి ప్రధాని తిలోదకాలిచ్చి మొదటి పాపానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
 
యువరాజు నాయనమ్మ (ఇందిరాగాంధీ) రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. ఎమర్జెన్సిని విధించి దేశంలో అనేకమంది మహానీయులను జైలులో పెట్టారన్నారు. అదే సమయంలో మీడియా స్వేచ్ఛను కూడా హరించి రెండో పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు.
 
యువరాజు తండ్రి ప్రధానిగా (రాజీవ్​ గాంధీ) ఉన్నప్పుడు  మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేశారన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం అనేకమంది మహానీయులతోపాటు బీజేపీ కూడా ముందుకు వచ్చి పోరాటం చేస్తే ఆ దెబ్బకు రాజీవ్​ గాంధీ దిగి వచ్చారని పేర్కొన్నారు. దాంతో రాజ్యాంగాన్ని కాపాడుకున్నామని మోదీ తెలిపారు. ఈ విధంగా యువరాజు కుటుంబం మూడు పాపాలు చేసిందని మోదీ మండిపడ్డారు. 
సేవాలాల్​ సేవలను చరిత్ర మరిచిపోదు..
26 రాత్రికి రాత్రే బీసీ కులాలకు అన్యాయం చేసే నిర్ణయాన్ని తీసుకొని ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రధాని తీవ్రంగా ఆక్షేపించారు. బంజారా సమాజాన్ని అవమాన పరిచేలా ఈ చర్యలు ఉన్నాయన్నారు. సేవాలాల్​ మహారాజ్​ సేవాభావాన్ని దేశ చరిత్ర ఎన్నటికీ మరిచిపోదని ప్రధాని పేర్కొన్నారు. 
పార్లమెంట్​ లో ప్రతులు చించుతారా?..
భారత రాజ్యాంగం ప్రకారం మన్మోహన్​ సింగ్​ కేబినెట్​ నిర్ణయం కొని బిల్లులు తీసుకువస్తే ఆ ప్రతులను యువరాజు (రాహుల్​ గాంధీ) మీడియా ముఖంగా సాక్షాత్తూ పార్లమెంట్​ లో చింపివేయడాన్ని దేశ ప్రజలు చూశారని గుర్తు చేశారు. వీరా రాజ్యాంగాన్ని కాపాడేది అని మోదీ మండిపడ్డారు. 
ధర్మం ఆధారంగా రిజర్వేషన్లు ఉండబోవు..
ధర్మం ఆధారంగా ఈ దేశంలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండబోవని, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు, ఓబీసీలకే దక్కుతాయని బాబా సాహేబ్​ అంబేద్కర్​ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. అసత్యాలు ప్రచారం చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితులు, ఆదివాసీ వర్గాలను కాంగ్రెస్​ మోసం చేస్తోందని తెలిపారు. రాత్రికి రాత్రే తలుపులు మూసీ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారా? అని మండిపడ్డారు. 
ఏనుగుపై ఊరేగించి గౌరవించా..
హస్తం పార్టీ నాయకులు చెవులు పెద్దవి చేసుకొని వినాలని అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాజ్యాంగానికి 60యేళ్లు పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగాన్ని ఏనుగుపై ఊరేగించి దాని ప్రాశస్త్యాన్ని గౌరవిస్తూ తాను మాత్రం కాలినడకన నడిచానని గుర్తు చేశారు. 
2014లో దేశ ప్రజలు ఎన్నుకొని మొదటి పార్లమెంట్​ కు పంపారన్నారు. తాను ముందుగా రాజ్యాంగం ముందు తలవంచి నమస్కరించానని గుర్తు చేశారు.
2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైనప్పుడు కార్యభారం వహించే ముందు పార్లమెంట్​ సెంట్రల్​ హాల్​ లో రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకొచ్చానన్నారు. తాను రాజ్యాంగ పుస్తకం ముందు తలవంచి నమస్కరించానని తెలిపారు. అనంతరం తాను 2019 పాలనకు సిద్ధమయ్యానని గుర్తు చేశారు. 
సొంతపార్టీ నేతనే రోడ్డున పడేశారు..
కాంగ్రెస్​ ది తుగ్లక్​ పాలన అన్నారు. సొంత పార్టీ నాయకుడు సీతారామ్​ కేసరిని బాత్రూమ్​ లో పడవేశారని, ఆయన్ను రోడ్డుపై పడవేశారని మోదీ ధ్వజమెత్తారు. 
దేశ ప్రజలను మూర్ఖులను చేసే ప్రయత్నం..
కాంగ్రెస్​ పార్టీ రాజ్యాంగం పేరుతో దేశ ప్రజలను మూర్ఖులను చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్రాలను  హరించే కుటుంబమే యువరాజు (కాంగ్రెస్​) కుటుంబమని అన్నారు.
రాజ్యాంగంతో వీరికి పనిలేదు..
వీరికి రాజ్యాంగంతో ఏమీ పనిలేదని గద్దెనెక్కడమే ముఖ్యమని అన్నారు. వీరి వద్ద అధికారం లేకపోతే ఎంత నీచానికైనా దిగజారుతారని స్పష్టం చేశారు. పార్లమెంట్​ ను సైతం నడవనీయరని, ఈసీపై, ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తుతారని మండిపడ్డారు. 
పుణ్యభూమి సాక్షిగా మరోసారి అధికారం ఖాయం..
తెలంగాణ పుణ్​యభూమి నుంచి మోదీ మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటామన్నారు. మూడోసారి ప్రభుత్వంలో మన రాజ్యాంగానికి 75యేళ్లు అవుతున్నాయని అన్నారు. గల్లీ గల్లీలో కాంగ్రెస్​ చేసిన పాపాలను విడమరిచి చెబుతానని, ఇంటింటికి వెళ్లి చెబుతానని అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తానని ఇది మోదీ హామీ (గ్యారంటీ) అని తెలిపారు.
ఫేక్​ వీడిల్లో సీఎం హస్తం..
కాంగ్రెస్​ నాయకులు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఫేక్​ వీడియోలతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సాక్షాత్తూ తెలంగాణ సీఎం రాజ్యాంగాన్ని అవమానించేలా ఇలాంటి పనికి పాల్పడతారా? అని ప్రశ్నించారు. 
తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్లిచ్చాం..
తెలంగాణ, దేశ అభివృద్ధికి బీజేపీయే వికల్పమని, సంకల్పమని అన్నారు. తెలంగాణ సంక్షేమం కోసం లక్షల కోట్లు ఇచ్చామన్నారు. తెలంగాణలో నాలుగు వందే భారత్​ ట్రైన్​ లు నడుస్తున్నాయన్నారు. 40 స్టేషన్లను అమృత స్టేషన్ల కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. జహీరాబాద్​ రైల్వే స్టేషన్​ కూడా ఉందన్నారు. మెదక్​–ఎల్లారెడ్డి, బోధన్​, బాన్సువాడ జాతీయ రహదారి కూడా పొందిస్తున్నామన్నారు. 
సంగారెడ్డి–నాందేడ్​ హైవే కూడా నిర్మిస్తున్నామన్నారు. దీనివల్ల ఆందోల్​, నారాయణ్​ ఖేడ్​, జుక్కల్​ ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. 
కేంద్రం పనులను అడ్డుకుంటున్న ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వ పనులను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని మోదీ మండిపడ్డారు. ట్రైబల్​ యూనివర్సిటీలు మంజూరు చేస్తే భూమిని ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. మనోహారాబాద్​, సిద్ధిపేట, సిరిసిల్ల, కొత్తపేటలలో రైల్వే లైన్​ లను నిర్మిస్తామంటే ఈ ప్రభుత్వం భూములను ఇవ్వకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇలాంటి వారికి ఒక్క ఎంపీ స్థానమైనా లభించాలా? అని మోదీ ప్రశ్నించారు.
కూటమిలోనూ నిరాశ, నిస్పృహలు..
ఇండికూటమిలో నిరాశ, నిస్పృహలు కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. చరిత్రలో కాంగ్రెస్​ ఘోర ఓటమిని చవి చూడనుందని అన్నారు. 13 మే జహీరాబాద్​ నుంచి బీజేపీ అభ్యర్థి బీంరామ్​ పాటిల్​, మెదక్​ నుంచి రఘునందన్​ రావులకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఓటు నేరుగా మోదీకే చేరుతుందని తెలంగాణ, దేశ భవిష్యత్తుకు పునాదులను మరింత పటిష్ఠం చేసుకోవచ్చని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.