ఓట్లు చీల్చే కుట్రను తిప్పికొట్టాలి
ఒక్క ఓటూ వృథా కానీయొద్దు: కిషన్ రెడ్డి – ప్రజలు ఐక్యంగా మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి – కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే – కమలం గుర్తుకు ఓటు వేయండి.. అభివృద్ధి బాధ్యత నాదే – నాంపల్లి నియోజకవర్గ జీప్ యాత్రలో కేంద్ర మంత్రి
నా తెలంగాణ, హైదరాబాద్: నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఓట్లు చీల్చే కుట్ర చేస్తాయని ప్రజలు ఐక్యంగా మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి.కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఓటు వేస్తే.. మూసీలో వేసినట్టేనని, ఒక్క ఓటు కూడా వృథా కానీయొద్దని ఆయన సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి శుక్రవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాంపల్లి సెగ్మెంట్ లో జీప్ యాత్ర నిర్వహించారు.
మోదీ నాయకత్వమే దేశానికి రక్ష
వచ్చే నెల13న జరిగే ఎన్నికల్లో మరోసారి కమలం పార్టీ గుర్తుమీద ఓటు వేసి ప్రధాని మోదీని గెలిపించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘మోదీ నాయకత్వమే ఈ దేశంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. గత తొమ్మిదన్నరేండ్ల నుంచి అన్ని వర్గాలకు ఆయన అండగా నిలబడ్డారు. మోదీ నాయకత్వమే దేశానికి రక్ష, ఆయనను మరోసారి ప్రధానిని చేయాలి. సికింద్రాబాద్ నుంచి నన్ను మరోసారి ఆశీర్వదించండి. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మోదీ హ్యాట్రిక్ విజయం ఖాయం.. ఆయన తప్పకుండా జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మన దేశం కోసం, దేశ భవిష్యత్ కోసం మరోసారి కమలం గుర్తుకు ఓటు వేయాలి”అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
అభివృద్ధి కొనసాగుతుంది..
కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడిన గొప్ప నాయకుడు మోదీ అని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘కరోనా కష్టకాలం నుంచి గత మూడు నాలుగు ఏండ్లుగా ఇస్తున్న ఉచిత బియ్యంను మరో ఐదేళ్లు ఇస్తామని మోదీ చెప్పారు. పేదలకు ఎల్పీజీ సిలిండర్లు ఇస్తున్నది మోదీ. పొదుపు సంఘాలకు రూ. 20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ తీసుకువచ్చి పేదలకు వైద్యాన్ని అందిస్తున్నారు. మోదీ వచ్చారు కాబట్టే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. మోదీ లేకపోతే దేశంలో అవినీతి, మజ్లిస్ గుండాయిజం, అరాచకాలు పెరుగుతాయి. దేశం బాగుండాలంటే మోదీని గెలిపించాలి. ఇక్కడ మజ్లిస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఎవరు అభివృద్ధిని ఆపినా.. ఆగదు. నేను అభివృద్ధి చేస్తాను”అని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు