- అప్పులెన్నీ? ఎన్ని ఖర్చు చేశారు?
- ఆరు గ్యారంటీల మాటలేమిటి?
- పాఠశాలలకు అద్దె ఇవ్వక తాళాలు వేసే పరిస్థితి
- మూసీ సుందరీకరణకు డీపీఆర్ సిద్ధం చేశారా?
- భూములను అమ్ముతారా? ఆక్రమించుకుంటారా?
- కాళేశ్వరంతో బీఆర్ఎస్, మూసీ పేరుతో కాంగ్రెస్ దోపిడీకి స్కెచ్
- రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదు
- రేవ్ పార్టీపై సమగ్ర విచారణకు డిమాండ్
- పోలీసుల సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలి
నా తెలంగాణ, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల హయాంలో చేసిన అప్పులెన్నీ, అభివృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు? సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు ఖర్చు చేశారు? ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు? ఆరు గ్యారంటీల మాటెమిటి? వంటి వాటి సమగ్ర వివరాతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని, ప్రజలకు కూడా ఈ విషయాలను తెలియాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అప్పులూ, ఆస్తులపై శ్వేతపత్రం..
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, పాఠశాలలకు కిరాయి ఇవ్వలేని పరిస్థితుల్లో తాళాలు పడుతున్నాయని విమర్శించారు. ఆయా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సైతం రూ. 5, రూ. 10 లక్షలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. వీధి లైట్లు సరి చేసే కార్మికులకు జీతాలు, నూతన బల్బులకు నిధులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని కిషన్ రెడ్డి తెలిపారు. 10 నెలల్లో జరిగిన ఒప్పందాలు, అప్పులపైన, ప్రభుత్వ స్థిరాస్తులపైన, రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
హామీల అమలేది?..
రూ. 2500 మహిళలకు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం, కాలేజీ విద్యార్థులకు స్కూటీలు, వితంతు, విద్యార్థులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పెన్షన్, విద్యార్థులకు ఇస్తున్న రూ. 5 లక్షల భరోసా కార్డు, యువతకు నిరుద్యోగ భృతి, కౌలు రైతులకు ఇస్తామన్న రూ. 15వేలు, రైతు బంధు, విద్యార్థుల మెస్ చార్జీల పెంపు, గ్యాస్ పై సబ్సిడీ, దళిత, మైనార్టీ, యువత, రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు ఏమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయుష్మాన్ భారత్, పంటల బీమా లాంటి కేంద్ర పథకాలు ఏ రకంగా అమలు చేయబోతున్నారో? ఆరు గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో? సమగ్రంగా శ్వేతపత్రం ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. బీజేపీ వచ్చాక రాష్ర్టాలకు ఇచ్చే నిధుల పద్ధతిని పాటిస్తున్నామని తెలిపారు. రివల్యూషనరీ ఫండ్ ను 32 నుంచి 42 శాతానికి పెంచామన్నారు.
ఏయే భూములు అమ్ముతారు?..
రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలను వదిలేసి నలవికాని మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేదల ఇళ్లు కూలుస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు లక్షా యాభై వేట్ల కోట్ల నిధులు ఎటు నుంచి తీసుకువస్తారని, ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారని? ఏయే భూములు అమ్మాలనుకుంటున్నారు? మూసీలో ఎంతమేర భూములు అమ్ముతారా? ఆక్రమించుకుంటారా? ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ డీపీఆర్, ఆర్థిక ఒప్పందాలు, సరైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు. అవన్నీ లేకుండా ముందుగా నిరుపేదల ఇళ్లు ఎలా కూలుస్తారని మండిపడ్డారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన దొందూ దొందేనని విమర్శించారు. ఇరు ప్రభుత్వాలు చేసిన ఖర్చు, అప్పులు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనకు అయిన ఖర్చులతో సహా లెక్కలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో దోపిడీకి పాల్పడితే, కాంగ్రెస్ మూసీ సుందరీకరణ పేరుతో దోపిడీ పర్వానికి తెర తీసిందని ఆరోపించారు. గత పది నెలల కాలంగా రేవంత్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో రియల్ బూమ్ కుప్పకూలిందని, రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయని, ఫ్లాట్లు, ప్లాట్లు కొనే పరిస్థితి లేదన్నారు. పరిశ్రమల స్థాపన ఆగిపోయిందని ఆరోపించారు. తెలంగాణను ఈ రెండు పార్టీలు ఆర్థికంగా భ్రష్ఠు పట్టించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రిటైనింగ్ వాల్ కట్టి నీరు తీసుకురండి..
మూసీ సుందరీకరణను బీజేపీ అడ్డుకుంటోందని నల్గొండ ప్రజలను, రైతులను రెచ్చగొడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాము మరోమారు స్పష్టంగా చెబుతున్నామని సుందరీకరణ, మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని రిటైనింగ్ వాల్ కట్టి అందులో గంగా, కృష్ణ, గోదావరి ఎటునుంచి నీరు తీసుకువచ్చినా తమకేమి అభ్యంతరం లేదన్నారు. అలాకాకుండా నిరుపేదల ఇళ్లు కూల్చివేస్తామంటే మాత్రం ఉరుకునేది లేదన్నారు.
సిద్ధిపేట, గజ్వెల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్ కు ఎంత ఇచ్చారో? హరీష్ రావు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రేవ్ పార్టీ..
జన్వాడ రేవ్ పార్టీ నిజమో కాదో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా చట్టబద్ధంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ లు, దొంగవీడియోలు గతంలో తీసి జడ్జిలకు పంపారని, ఇవన్నీ కుట్రలో భాగమేనని స్వయంగా ఆయన హయాంలో ఉన్న పోలీసులే వాంగ్మూలం ఇచ్చారని మంత్రి తెలిపారు. రేవ్ పార్టీపై అలాకాకుండా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కిందిస్థాయి పోలీసుల సమస్యలు పరిష్కరించాలి..
పోలీసు ఉద్యోగస్తులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. బాస్ లతో ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేయొద్దన్నారు. ఖచ్చితంగా కిందిస్థాయి పోలీసు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సామరస్యంగా వారితో మాట్లాడాలని, వారికి న్యాయం చేయాలని కక్షసాధింపు, వేధింపు, సస్పెండ్ లు చేయవద్దనేదే బీజేపీ విధానమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.