14 కోట్లు ఇవ్వకుంటే.. నీ ఫార్మా ఉండదు

శరత్​ చంద్రారెడ్డికి ఎమ్మెల్సీ కవిత బెదిరింపులు – ల్యాండ్​ డీల్​ చేసుకోకుండా తెలంగాణలో బిజినెస్​ ఎలా చేస్తావో చూస్తా – నకిలీ భూ విక్రయం పేరిట రూ.14 కోట్లు ఇవ్వాలని డిమాండ్​ – కవిత జాగృతి సంస్థకు రూ.80 లక్షలు ఇచ్చిన శరత్​ – కేజ్రీ అనుచరుడు విజయనాయర్‌కి కవితే రూ.100 కోట్లు చెల్లింపులు – కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టిన సీబీఐ

Apr 12, 2024 - 16:13
 0
14 కోట్లు ఇవ్వకుంటే.. నీ ఫార్మా ఉండదు

నా తెలంగాణ, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ. ఈ స్కామ్​ లో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది. కవితే రూ.100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి.. కవిత జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు చెప్పింది.

వ్యవసాయ భూమి పేరుతో..

నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ.14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ. 80 లక్షలు చెల్లించారని పేర్కొంది. మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ.14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని, అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14 కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పినట్లు రిపోర్టులో నమోదు చేసింది. కానీ, రూ.14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ అభియోగాలు మోపింది. 

రిటైల్​ జోన్లకు..

ఒక్కో రిటైల్ జోన్‌కి రూ.5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని సీబీఐ ఆరోపించింది. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25 కోట్లు చెల్లించారని తెలిపింది. కాగా కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కు కవితే రూ.100 కోట్లు చెల్లించారని సీబీఐ తెలిపింది. అలా ఇండో స్పిరిట్స్‌లో 65 శాతం వాటా పొందారని, గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారని, కవిత పీఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చినట్లు సీబీఐ చెప్పింది. 

5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ లో కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని.. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. తీహార్ జైలు ఉన్న బీఆర్ఎస్ ఎమెల్సీ కవితను సీబీఐ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితే కీలక సూత్ర దారి అని, 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్​ చేసింది