దిక్కూ దివానం లేని గ్యారంటీలు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆర్జీ ట్యాక్స్ కోసం వ్యాపారులకు వేధింపులు ఎన్నికలయ్యాక రాహల్ ఇటలీకే పోరాడి తెచ్చుకున్న తెలంగాణను దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ బీఆర్​ఎస్​ ది ముగిసిన అధ్యాయం​:  రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ 

Apr 9, 2024 - 20:44
 0
దిక్కూ దివానం లేని గ్యారంటీలు

నా తెలంగాణ, హైదరాబాద్​: కాంగ్రెస్​ పార్టీ ప్రజల మీద ఆర్​ జీ (రాహుల్​ గాంధీ) ట్యాక్స్​ వేస్తోందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి ఆరోపించారు. దేశంలోని కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుపెట్టేందుకు తెలంగాణలోని కాంట్రాక్టర్లు, బిల్డర్లు, వ్యాపార, వాణిజ్య వర్గాలను బెదిరించి అక్రమ వసూళ్లు చేస్తూ ఢిల్లీకి తరలిస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నల్గొండ, జహీరాబాద్​ నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద యెత్తున చేరిన సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి వారికి శాలువా కప్పి ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్ నగర బీజేపీ కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ లోక్ సభ ప్రచార రథాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..  దేశ ప్రజలు కాంగ్రెస్​ పార్టీతో విసుగు చెందారని తెలిపారు. పోరాటాలు, బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని  అన్నారు. గత పదేళ్లుగా కేసీఆర్​ కుటుంబం తన స్వార్థం కోసం తెలంగాణను దోచుకుతిందన్నారు. కేసీఆర్​ కేవలం కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఫౌంహౌస్​ లాంటి ఆస్తులను కొల్లగొట్టారని తెలిపారు. ఆయన పాలన నుంచి విముక్తి దొరికిందనుకున్న ప్రజలకు నేడు దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లు కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలకు దిక్కు దివానం లేక ప్రజలు విసిగి వేసారుతుంటే ఉన్నవి చాలవన్నట్లు రాహుల్​ గాంధీ తుక్కుగూడ వేదికగా కొత్త హామీలను ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు నగదు బదిలీ తదితర హామీలను వంద రోజుల్లో నెరవేరుస్తామని ముఖం చాటేసిన పార్టీ కాంగ్రెస్​ అని దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలు పొంగడాల పార్టీలేనని అన్నారు. అవినీతి, అక్రమాల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ బొమ్మా బొరుసు లాంటివన్నారు. కేసీఆర్​ లిక్కర్​, సాగునీరు, భూములు, గ్రానైట్, ప్రాజెక్టులు, ఇసుక, రింగు రోడ్డు చుట్టూ భూములను హాంఫట్​ చేశారన్నారు. తన ఆస్తులను పెంచుకున్నారని కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ గిరిజన ఆడబిడ్డను రాష్ర్టపతిగా నిల్చోబెడితే ఓర్వజాలని కేసీఆర్​ కాంగ్రెస్​ తో అంటకాగి ఆ ప్రధాని అభ్యర్థిని వేసుకొని నగరమంతా తిరిగారని గుర్తు చేశారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ దొందూ దొందేనన్నారు. 

హిమాచల్​.. కర్ణాటకలో అన్ని స్థానాల్లో గెలుపు..

 కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మూడు స్థానాలకే పరిమితమైందని కిషన్ రెడ్డి తెలిపారు. హిమాచల్​ లోని నాలుగు స్థానాలు, కర్ణాటకలోని 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతోందని మంత్రి చెప్పారు. కర్నాటకలోనూ తెలంగాణ మాదిరే ఇచ్చిన గ్యారంటీలకు దిక్కు దివానం లేదన్నారు. ప్రజలు రోడ్లపై పడి ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్యారంటీలపై రోడ్డుమ్యాపు, ఏజెండా, నిధుల సమీకరణ, వనరులు సమకూర్చుకోవడం లాంటి ఏ ప్రణాళిక లేకుండా కాంగ్రెస్​ వెళుతోందని ఆరోపించారు. వందరోజుల్లో తెలంగాణలో గ్యారంటీ అని ఇక్కడి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని తెలిపారు. దేశ ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. అనంతరం రాహుల్​ గాంధీ ఇటలికో, స్విట్జర్లాండ్​ కో వెళ్లడం ఖాయమని కిషన్​ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అసమర్థత, వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని.. జీవితంలో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదన్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలని, బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని, కుట్రలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన ప్రత్యర్థి అని కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

17 స్థానాల్లో గెలుపు మనదే..

తెలంగాణ, దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోదీ దక్ష దీక్షితలతో ముందుకు వెళదామని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో దేశాన్ని అగ్రగామిలో నిలబెట్టిన ఘనత మోదీదే అని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని భద్రంగా ఉంచుకోవాలని సైనిక శక్తికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేశామన్నారు. దేశంలో అవినీతి, కుంభకోణాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలను ప్రధాని మోదీ తీసుకున్నారని స్పష్టం చేశారు. 

అభివృద్ధిని చూసే చేరికలు..స్వాగతించిన మంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ వెంట నడిచేందుకు పార్టీలో చేరుతున్న రామరాజు, సుధాకర్ రెడ్డి, మల్లేశ్​ గౌడ్​, తిరుమలేశ్​, వెంకటేశ్​, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, బీసీ సంఘాలు, యువజన సంఘాలు, అంబేద్కర్​ సంఘాల ప్రతినిధులకు పేరు పేరున మంత్రి కిషన్​ రెడ్డి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో మాజీ మంత్రి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరీలున్నారు. సైదీ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు చేరడాన్ని మంత్రి కిషన్​ రెడ్డి స్వాగతించారు. పార్టీ ప్రగతికి, దేశ, రాష్ర్ట అభివృద్ధికి మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో భారీ యెత్తున చేరికలపై హర్షం వ్యక్తం చేశారు. 

12 స్థానాలు ఖాయం​: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​..

బీఆర్​ఎస్​ ది ముగిసిన అధ్యాయం అని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ అన్నారు. కాంగ్రెస్​ ను ఓడించేందుకు బీఆర్​ఎస్​ కు ఓటేస్తే అదీ మురిగిపోతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశ, రాష్ర్ట భవిష్యత్తు ఉందని ప్రజలు గుర్తెరగాలని తెలిపారు. అందుకే బీజేపీకి పెద్ద యెత్తున ఓట్లు వేసి గెలిపించాలని తెలిపారు. తెలంగాణలో 10 నుంచి 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని లక్ష్మణ్​ స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అదే సమయంలో అవినీతి, కుటుంబ పాలన పార్టీలే అంతమే లక్ష్యమన్నారు.