వర్షాలతో భారీ నష్టం అధైర్యపడొద్దన్న కలెక్టర్​

ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ

Sep 8, 2024 - 19:38
 0
వర్షాలతో భారీ నష్టం అధైర్యపడొద్దన్న కలెక్టర్​

నా తెలంగాణ, మెదక్​: జిల్లాలో భారీ వర్షాలకు నష్టపోయిన వారు అధైర్యపడవద్దని వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మెదక్​ జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు. ఆదివారం వర్షాల వల్ల నష్టపోయిన హవేలీ ఘన్​ పూర్​ మండలంలోని పలు దెబ్బతిన్న ఇళ్లను కలెక్టర్​ రాహుల్​ రాజ్​ పరిశీలించారు. మండంలోని భారీ వర్షాలకు 25 ఇళ్లు పాక్షికంగా, ఒక ఇంటికి పూర్తిగా నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కూలిపోయే దశలో ఉన్న ఇళ్లలో నివసించే వారికి ప్రభుత్వ పాఠశాలలు, భవనాల్లో నివాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. 

కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించి పునర్నిర్మాణం చేస్తామన్నారు. వరద నష్టంపై యుద్ధ ప్రాతిపదికన అధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు శ్రద్ధ వహించాలన్నారు. సీజనల్​ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అదే సమయంలో జిల్లా, పంచాయితీ, వైద్య అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి పరిసరాల శుభ్రత, సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హవేలీ ఘన్​ పూర్​ తహాశీల్దార్​ నవీన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.