గేదె పేడేసింది.. శుభ్రం చేయలేదని రూ. 9వేల జరిమానా, గేదె జప్తు!
గ్వాలియన్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయంపై లబోదిబోమంటున్న యాజమాని
భోపాల్: మధ్యప్రదేశ్ లోని మున్సిపల్ కార్పొరేషన్ గేదె పేడవేసిందని, స్వచ్ఛతకు ఆటంకం కలిగిందని రూ.9వేలు జరిమానా వేసింది. అంతటితో ఆగకుండా గేదెను కూడా జప్తు చేస్తూ యాజమానికి షాక్ ఇచ్చింది. గురువారం జరిమానా వేసినా శుక్రవారం ఈ ఘటన వెలుగులోకొచ్చింది. గ్వాలియర్ లో జరిగిన ఈ ఘటన మీడియా దృష్టికి వచ్చింది. గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛతపై క్యాంపెయినింగ్ నిర్వహిస్తోంది. ఈ సమయంలో ఇంటి బయట రోడ్డుపై ఓ వ్యక్తి తన గేదెను కట్టివేశాడు. ఆ గేదె వేసిన పేడను శుభ్రం చేయలేదు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోన్ చేసి వెంటనే గేదెను కట్టివేసిన ప్రాంతానికి రావాలని ఆదేశించింది. ఆ వ్యక్తి అక్కడకు రాలేదు. దీంతో మున్సిపాలిటీ అధికారులకు చిర్రెత్తుకొచ్చింది. అంతే స్వచ్ఛతకు భంగం వాటిల్లేలా చేసినందుకు రూ. 9 వేల జరిమానాతోపాటు గేదెను జప్తు చేసింది. దీంతో గేదె యాజమాని లబోదిమంటున్నాడు.