64 లక్షల రైతులుంటే 17లక్షల మందికే రుణమాఫినా?
11 నెలలైనా హామీలు ఎందుకు అమలు చేయడం లేదు
రెండు నెలలైనా వరిధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారు?
మూసీకి ఓ ప్రణాళిక అంటూ ఉందా?
ఇళ్లు కూలగొట్టడమే ప్రణాళికా
నా తెలంగాణ, హైదరాబాద్: రైతుల సంక్షేమం కోసం బీఆర్ కేసీఆర్, సీఎం కేసీఆర్ చెప్పిన, చెబుతున్న మాటలు ఉత్తి పొంకనాలే అని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. దొడ్డు వడ్ల కొనుగోలు దేవుడెరుగు గానీ ఇచ్చిన హామీ ప్రకారం సన్నవడ్లకు బోనస్ వస్తుందని చెప్పి వాటికి సవాలక్ష మెలికలు పెట్టి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. రాష్ర్టంలో 64 లక్షల మంది రైతులంటే కేవలం 17 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. 11 నెలల నుంచి సీఎం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు. మూసీ ప్రక్షాళన పేరుతో నిరుపేదల ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. ప్రక్షాళనకు ఓ ప్రణాళిక అంటూ ఏమీ లేదన్నారు. ఎంత సమయం పడుతుందో వారికే తెలియదని విమర్శించారు.
మహారాష్ట్రలోనూ పొంకనాలే..
సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని శనివారం జరుగుతున్న సభలో చెప్పుకుంటున్నారని? నిజంగా అవి మీకు అందాయా? అని పలువురిని ప్రశ్నించారు? కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో ప్రజలను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మహారాష్ర్టలో గెలవాలని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ అబద్ధపు వాగ్ధానాలు చేస్తున్నారని మండిపడ్డారు. హరియాణా ప్రజలు కాంగ్రెస్ అసత్య మాటలను గుర్తించి ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.
దమ్ముంటే రాహుల్ కల్లాల వద్దకు రా!
రాహుల్ గాంధీకి దమ్ము ధైర్యం ఉంటే రైతుల కల్లాల వద్దకు రావాలని, బేగంపేటకు వచ్చి విమానంలో తిరిగి వెళ్లడం కాదని, తెలంగాణలో మీ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయో? లేదో? రైతుల మధ్యే తేల్చుకుందామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మోదీని విమర్శించడం కాదని మహిళలకు రూ. 2500 ఇచ్చారా, విద్యార్థులకు స్కూటిలు ఇచ్చారా? కౌలు రైతులకు రూ. 15వేలు ఇచ్చారా? రైతు కూలీలకు రూ. 12వేలు ఇచ్చారా? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇచ్చారా? రైతుల రుణమాఫీ చేశారా? ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారా? అని రాహుల్ గాంధీని నిలదీశారు.
పోచంపల్లి వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలన..
శనివారం తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు రెండు నెలలుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఉంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వివరాలను మంత్రి కిషన్ రెడ్డితో ఏకరువు పెట్టారు. రైతు దీనావస్థపై కొనుగోలు కేంద్రం పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు.
దున్నపోతు ఈనిదంటే.. కట్టేయ్యమన్నారన్నట్లు రేవంత్ పాలన..
అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి రైతులెవ్వరూ రుణాలను కట్టవద్దని తాను మొదట రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 64 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులైతే కేవలం 17 లక్షల మందికి మాత్రమే మాఫీ చేస్తారా? అని నిలదీశారు. 1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన పేరుతో నిరుపేదల ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇల్లే ఇవ్వని ప్రభుత్వానికి ఇళ్లు కూలగొట్టే అధికారం ఎక్కడిదని నిలదీశారు. మూసీలోకి గోదావరి, కృష్ణ నీరు ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు సరైన ప్రణాళికే లేదన్నారు. మూసీలోకి పారుతున్న డ్రైనేజీ నీటిని ఎలా మళ్లిస్తారు? ఎక్కడికి మళ్లిస్తారని ప్రశ్నించారు. దున్నపోతు ఈనిందంటే కట్టేయ్యమన్నారన్నట్లు సీఎం వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు.
పండించిన ధాన్యం తడుస్తుంటే పట్టించుకోరా..
రెండు నెలల నుంచి రైతులు కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యాన్ని పెట్టుకొని ఇంటివద్ద పిల్లలు, వృద్ధులను వదిలి కాపలా కాస్తున్నారని అన్నారు. వారి సద్ది కూడా వర్షానికి తడిచిపోతుందన్నారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేస్తుందని దుయ్యబట్టారు. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ రైతుపండించిన ధాన్యం తడిసి ముద్దయి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధాన్యాన్ని ఎంతకు కొంటారు? ఎంత తరుగు తీస్తారు? ఎన్ని డబ్బులిస్తారు? ఎప్పుడిస్తారు? అనే ఆలోచనలతో రైతన్న పడే మానసికవేదన అంతా ఇంతా కాదన్నారు. మరోవైపు సీఎం బోటు షికారుకు వచ్చారే తప్ప, ఇక్కడి రైతుల గోడు పట్టించుకునే సమయం లేకపోయిందని విమర్శించారు.
హామీల అమలులో దిక్కూ దివానం లేదు..
మహారాష్ర్ట ఎన్నికల సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని అసత్యాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు దయ్యాలకు వేదాలు వల్లించినట్లున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు సీఎం ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఏ ఒక్కటైనా ఎవ్వరికైనా లభిస్తున్నాయా? అని ప్రశ్నించారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, రేషన్ కార్డులు, గృహాలు, రైతు కూలీలు, కౌలు రైతులకు డబ్బులు, తులం బంగారం, స్కూటీలు ఎక్కడిచ్చారని నిలదీశారు. తన రాష్ర్టంలో ఇవ్వనివి ఇచ్చానని మహారాష్ర్టలో ప్రచారం చేయడం ఆయన దుష్ర్పచారానికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రూ. 2320లు ఇస్తుంటే దానికి అదనంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 500 ఇస్తుందని అక్కడ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనే దిక్కూ దివానం లేదని అక్కడ వెళ్లి అసత్య ప్రచారాలు చేపడతావా? అని నిలదీశారు.
మోదీ ప్రభుత్వం రైతులకు చేసిన మేలు..
రాష్ర్ట ప్రభుత్వంపై ఒక్కరూపాయి భారం పడనీయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లెక్కలతో సహా వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, గన్నీబ్యాగుల కొనుగోలు , వడ్డీల చెల్లింపులు ఇలా ప్రతీ నయాపైసా లెక్కలను వివరించారు.
ధాన్యం కొనుగోలుకు కేంద్రం చెల్లిస్తున్న నిధులు..
ఎంఎస్ పీ (మినిమం సపోర్టు ప్రైజ్) రూ. 2,320
మార్కెట్ ఫీజు ఎంఎస్ పీపై
ట్రాన్స్ పోర్టేజ్ చార్జెస్, ఎఫ్ సీఐ చేరే వరకు, అక్కడి నుంచి రేషన్ షాపుల వరకు
రైతు సంఘాలు, ఐకేపీ సెంటర్స్, మార్కెట్ యార్డ్స్ ధాన్యం కొనుగోలు చేసేందుకు మధ్యవర్తులకు కమిషన్
కస్టడీ అండ్ మెయింటెనెన్స్ గోడౌన్ చార్జెస్
రికార్డుల నిర్వహణ
చార్జెస్ ఆఫ్ ప్యాకేజింగ్
గన్నీ బ్యాగుల కొనుగోలుకు అయ్యే ఖర్చు, తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చు
ఇలా ప్రతీ నయాపైసా మోదీ ప్రభుత్వమే ఇస్తుందని రాష్ర్ట ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలేనని నివేదికలతో సహా బయటపెట్టి సీఎం రేవంత్ రెడ్డి బండారాన్ని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి బహిర్గతం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం..
2014లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సంవత్సరానికి రూ. 1,536 కోట్ల ఖర్చు
2014లో 2.62 లక్షల మంది రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసేవారు.
2014లో ఎంఎస్ పీ రూ. 1300 (స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014లో అందించిన మొత్తం)
తెలంగాణలో బీజేపీ (మోదీ ప్రభుత్వం)..
2024లో 93 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు.
సంవత్సరానికి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు
ప్రస్తుతం 20 లక్షల మంది వద్ద వరిధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
పదేళ్లలో రూ. 1300 నుంచి రూ. 2,320 పెంచారు. (పదేళ్లలో పెంచిన మొత్తం)
ఒక్క కేజీ రూ. 34కు కొనుగోలు, 83 కోట్లమందికి ఉచిత రేషన్..
ఒక్కకేజీ రూ. 34కు కొనుగోలు చేస్తూ మోదీ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందన్నారు. వీరి నుంచి సేకరించిన ధాన్యాన్నే గత ఐదేళ్లుగా 83 కోట్లమందికి ఉచితంగా అందిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. మరో ఐదేళ్లపాటు ఉచిత రేషన్ కొనసాగుతుందన్నారు. అలాంటి మోదీని విమర్శించే హక్కు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలకు ఎక్కడిదని ప్రశ్నించారు. రైతు సంక్షేమం కోసం నయాపైసా రాల్చని మీకు వారి కష్టం ఎలా అర్థమవుతుందని నిలదీశారు.
హరియాణాలో నడ్డి విరిచారు..
మోదీ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుంటే బుల్‌డోజర్ తో తొక్కిస్తా అని ఒకరు అంటారు. రాహుల్ గాంధీకి దమ్ము దైర్యం ఉంటే, రాహుల్ కు నాయకత్వ లక్షణాలుంటే, చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ కల్లాల వద్దకు రావాలన్నారు. హైదరాబాద్ బేగంపేట్ కు వచ్చి మళ్లీ విమానం ఎక్కి పోవడం కాదన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు కదా? మహిళలు, నిరుద్యోగులు, రైతులకు అనేక వాగ్ధానాలు చేస్తున్నారా? కర్ణాటకలో, హిమాచల్ లో, తెలంగాణలో అన్యాయం చేశారని అన్నారు. హరియాణాలో గెలుస్తుందనుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని అన్నారు. అక్కడి ప్రజలు, రైతులు వీరి నిజ స్వరూపం తెల్చుకొని కర్రుకాల్చి వాతలు పెట్టారని విమర్శించారు. ఝార్ఖండ్, మహారాష్ర్ట లో కూడా కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదన్నారు. రైతును ఏడిపించే ప్రభుత్వాలు మనుగడలో ఉండబోవని హెచ్చరించారు. ఈ విషయంపై ఒత్తిడి చేస్తామని, రైతుల పక్షాన ఉద్యమిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తోడు దొంగలే..
బీఆర్ఎస్ కేసీఆర్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డివి పొంకనాలే అని విమర్శించారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో విమర్శిస్తే, సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విమర్శిస్తారే తప్ప వీరిద్దరు రైతు సంక్షేమానికి తెలంగాణ సమాజానికి ఉద్దరించింది ఏమీ లేదన్నారు. వీరికి రైతులపై ఎందుకింద కక్ష అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో ఇలాగే వ్యవహరించారని, రేవంత్ రెడ్డి కూడా ఇదే దిశలో పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రెండు నెలలుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడమే ఇందిరమ్మ పాలనా? అని నిలదీశారు. కేంద్రం రైతు సంక్షేమం కోసం అన్ని నిధులను అందజేస్తుంటే వారిని మభ్యపెడుతూ, కష్టపెడుతూ సాధించేది ఏమిటని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి రేవంత్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.