కాకతీయుల కళా తోరణంపై కాంగ్రెస్ కుట్ర?
చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ చిహ్నం రాచరిక ఆనవాలు ఎలా అవుతుంది?
నా తెలంగాణ, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చిహ్నంలో ఉన్న కాకతీయుల కళా తోరణాన్ని తొలగించాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయులు రాజులు అని, రాచరికపు ఆనవాళ్లు తెలంగాణ చిహ్నంలో ఉండకూడదని, అందుకే దాన్ని మారుస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాకతీయులు కేవలం రాజులేనా?
అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక.. శిల్పకళా సౌందర్యానికి నిలయం.. సాహితీ వేత్తల సౌరభాలు గుబాళించిన నేల.. కళల పుట్టినిల్లు.. కాకతీయ సామ్రాజ్యం. శాతవాహనుల తర్వాత తెలుగు దేశాన్నంతా ఒక రాజకీయ ఛత్రం కిందకు తెచ్చి దేశ సమగ్రత, సమైక్యతను చేకూర్చిన తెలుగుపాలకులు కాకతీయులు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ఒక ప్రత్యేక, విశిష్టమైన స్థానం ఉంది. వీరు విశాల సామ్రాజ్యాన్ని పాలించడమే గాక పటిష్ట పరిపాలనావ్యవస్థను ప్రవేశపెట్టి వ్యవసాయానికి నీటి వనరులు కల్పించి, గ్రామీణ జనజీవితాల్లో కళా సాహిత్యాలను సజీవపరిచి, విశిష్టమైన దేవాలయ నిర్మాణాలను కావించి, తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక వారసత్వ జీవనానికి తోడ్పడ్డారు. అందుకే వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.
టౌన్.. ట్యాంక్.. టెంపుల్
కాకతీయుల కాలంలో ప్రజా సంక్షేమం వెల్లివిరిసింది. గొలుసుకట్టు చెరువులతో పాటు రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపూర్, సింగసముద్రం, నల్లగొండ జిల్లాలో పానగల్ ఉదయసముద్రం రిజర్వాయర్‌తో పాటు వేలాది చెరువులు, కుంటలను నిర్మించి పొలాలకు నీళ్లు అందించిన గొప్ప పాలకులు కాకతీయులు. టౌన్(పట్టణం), ట్యాంక్(చెరువు), టెంపుల్(ఆలయం) నిర్మాణం పాలసీతో గ్రామాలను ఏర్పాటు చేసిన వారు కాకతీయులు. 800 ఏండ్ల కాకతీయుల చరిత్రకు నిదర్శమైన కాకతీయ కళాతోరణాన్ని రాచరికపు ఆనవాలుగా తెలంగాణ ప్రజలు భావించడం లేదు. ఈ కళాత్మక తోరణాన్ని రాష్ట్ర చిహ్నంలో పొందుపరిచినప్పుడు ఎవరూ అభ్యంతరం తెలుపలేదు.
కేంద్రం అంతర్జాతీయ గుర్తింపు తెస్తే..
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాకతీయులు కట్టిన రామప్పకు అంతర్జాతీయ యునెస్కో గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసింది. వెయ్యి స్తంభాల ఆలయం, వరంగల కోట లాంటి చారిత్రక వారసత్వ కట్టడాలను సంరక్షించేందుకు పెద్ద ఎత్తు నిధులు కేటాయిస్తున్నది. రామప్ప ఆలయం అద్భుత శిల్ప కళా సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నది. కానీ రాష్ట్ర సర్కారు అందుకు భిన్నంగా కాకతీయుల కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నం నుంచి తీసివేసి వారి పోరాటానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నదని చరిత్ర కారులు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తాజాగా ఈ అంశంపై స్పందిస్తూ.. కాకతీయుల కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నం నుంచి తొలగిస్తే.. కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతుందని హెచ్చరించారు.
వరంగల్ ప్రజల ఆగ్రహం..
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కాకతీయుల కళా తోరణాన్ని ఒక ప్రైడ్ గా చూస్తారు. వరంగల్ పౌరుషానికి దాన్నొక చిహ్నంగా భావిస్తారు. అలాంటి కళాతోరణం తొలగించాలని ఇటీవల సీఎం చేసిన ప్రకటనపై వరంగల్ ప్రజలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల పేరుతో వరంగల్ ను ముక్కలు చేస్తే.. ఈ ప్రభుత్వం వరంగల్ పోరాటల గడ్డకు ప్రతీక అయిన కళా తోరణాన్ని తెలంగాణ చిహ్నం నుంచి తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
రాచరికపు ఆనవాలు కానే కాదు
రాజులు అన్నాక సహజంగానే శిస్తులు కట్టమంటారు. కరెంట్ బిల్లు కట్టకుంటే.. ప్రభుత్వం కూడా మీటర్లు లాక్కెళ్తుంది కదా! గిరిజనులకు, అప్పటి రాజులకు జరిగిన పోరాటాన్ని.. మొత్తం కాకతీయుల చరిత్రతో ముడిపెట్టి చూడలేం. కళా తోరణం రాచరికపు ఆనవాలు కాదు.. దాన్ని తెలంగాణ చిహ్నం నుంచి తొలగించవద్దు.
– రెడ్డి రత్నాకర్ రెడ్డి, చరిత్రా పరిశోధకుడు
ఒక్క ఘటనతో నిర్ణయం తీసుకోలేం..
మొదటి ప్రతాప రుద్రుడితో సమ్మక్క, సారలమ్మలు ప్రత్యక్షంగా పోరాటం చేసినట్లు పూర్తి ఆధారాలు లేవు. సమ్మక్క, సారలమ్మలకు బంధువులైన పొలవాస రాజులకు, కాకతీయులకు మధ్య యుద్ధం జరిగినట్లు హన్మకొండ శాసనంలో ఉన్నది. ఈ ఒక్క ఘటనను ఆధారంగా చేసుకొని కాకతీయుల గొప్ప ప్రజాపాలనను, వారి కళాత్మక కృషిని, వారి కట్టడాలను రాచరికపు ఆనవాళ్లుగా చూడలేం.
– సందెవేని తిరుపతి, చరిత్ర పరిశోధన సమితి
స్వాగతించే విషయం కాదు
తెలంగాణ చిహ్నం నుంచి కాకతీయుల కళాతోరణం తొలగించడం స్వాగతించే విషయం కాదు. కాకతీయులది గొప్ప పాలన. కళా తోరణం వారి చరిత్రకు ఒక హెరిటేజ్ చిహ్నం. దీన్ని తొలగించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ప్రభుత్వం ఒకవేళ తొలగించాలనే నిర్ణయానికి వస్తే.. ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. అందులో వచ్చిన స్పందనను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.
– కూరపాటి వెంకట నారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్