ఈవీఎంలతోనే ఎన్నికలు స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
ఈవీఎం, బ్యాలెట్ పేపర్ల కేసులు కొట్టివేసిన కోర్టు
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో కాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో (ఈవీఎంలు) మాత్రమే జరుగుతాయని శుక్రవారం సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులకు సంబంధించిన అన్ని పిటిషన్లను సుప్రీం కొట్టివేసింది. దీంతో ఈవీఎంల వినియోగం, బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ తదితర కేసులకు చెక్ పెట్టినట్లయింది. ఈ కేసులు దేశ వ్యవస్థలో జోక్యం, అనవసర అనుమానాలను సృష్టించేలా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రోటోకాల్స్, టెక్నికల్ అంశాల గురించి వివరంగా చర్చించామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. తామిచ్చిన రెండు సూచనలు తప్పక పాటించాల్సిందేనని తెలిపారు. సింబల్ లోడింగ్ ప్రక్రియ, యూనిట్ ను సీల్ చేయాలని, ఎన్నికల అనంతరం 45 రోజులపాటు మిషన్ లోని సమాచారాన్ని భద్రపరచాలని పేర్కొన్నట్లు తెలిపింది.
ఒకవేళ ఎన్నికలలో లోటుపాట్లపై అభ్యర్థులకు అనుమానాలు ఉంటే ఫలితాలు వెలువడిన వెంటనే ఈసీకి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదు సచ్ఛీలతను బట్టి ఈసీ నిర్ణయం మేరకు ఏడు రోజుల్లోగా మరోమారు ఫలితాలను విశ్లేషించాలని అధికారులకు సూచించింది. అయితే ఇందుకు అయ్యే ఖర్చును మాత్రం అభ్యర్థులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలితే అభ్యర్థి చేసిన ఖర్చును పూర్తిగా తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
24 ఏప్రిల్ న ఇదే కేసును విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.