హస్తం మేనిఫెస్టో పర్సనల్ లా బోర్డు ఒకే విధానమైన చట్టం ఉండాలన్నదే తమ అభిమతం
దేశ విచ్ఛిన్న రాజకీయాలు కాంగ్రెస్, కూటమి దుష్ట ఆలోచనలు నీతి నిజాయితీ, సంక్షేమ పాలనకే ఓటేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పర్సనల్ లా బోర్డు ప్రస్తావన ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఒకే విధమైన న్యాయవ్యవస్థ ఉండాలన్నదే బీజేపీ విధానమని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్, కూటమి పార్టీలు దేశ విచ్ఛిన్న రాజకీయాలతో ప్రజలను మభ్య పెడుతున్నాయని మండిపడ్డారు. పర్సనల్ లా బోర్డు పూర్తిగా ముస్లింలకు వత్తాసు పలికేలా ఉంటుందని స్పష్టం చేశారు. అందరి కోసమే తాము యూసీసీ (యూనిఫామ్ సివిల్ కోర్డ్)ను తీసుకొచ్చామన్నారు. ఒకే దేశం ఒకే న్యాయం, ఒకే చట్టం అనేవే తమ విధానాలని అమిత్ షా పేర్కొన్నారు.
శుక్రవారం దేశంలో రెండో విడత ఎన్నికల సందర్భంగా మీడియాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్, కూటమి పార్టీలు దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో దేశ ప్రజలంతా దేశ సంక్షేమం కోసం, నీతి నిజాయితీ కలిగిన పార్టీకే ఓటేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
మోదీ పాలన దేశం అన్ని రంగాల్లో బలపడేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎళ్లవేళలా నిరుపేదలు,రైతులు, యువకులు, మహిళల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతుందన్నారు. రెండో విడతలో ప్రజలు మోదీ వైపే మొగ్గుచూపుతున్నారని ఎన్నికల ఓటింగ్ శాతాన్ని చూస్తే స్పష్టం అవుతుందని అమిత్ షా పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి హస్తం పాలన లోప భూయిష్టంగా ఉందన్నారు. కేవలం పదేళ్ల మోదీ పాలనలో లోపభూయిష్ట పాలనను సంక్షేమం దిశగా నడిపిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
మూడోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని మోదీ హ్యాట్రిక్ విజయం తరువాత దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళతామని కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.