జూన్ మూడో వారంలో 18వ లోక్ సభ, రాజ్యసభ ప్రారంభం
రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం జూలై–ఆగస్టులో వర్షాకాల సమావేశాలు 2024–25 సాధారణ బడ్జెట్ విడుదల
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 18వ లోక్ సభ జూన్ మూడో వారంలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపతి సభను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం 18వ లోక్ సభ తొలి సమావేశం నిర్వహించే యోచనలో కేంద్రం ప్రభుత్వ అధికారులు తెలిపారు. తొలిసభలో మంత్రిమండలి ఉభయ సభల్లోని సభ్యులు పాల్గొననున్నారు. జూన్ 22న సమావేశాన్ని ముగించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత ప్రధానిగా నరేంద్ర మోదీ సమావేశం ఉంటుందని, రెండు రోజుల అనంతరమే కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుందన్నారు. పార్లమెంట్, రాజ్యసభ ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలి ప్రసంగం చేయనున్నారు. దీంతో సభ ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఉభయ సభల నిర్వహణ ఖరారైనప్పటికీ తేదీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. వారంరోజులపాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. జూలై–ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వాధికారులు తెలిపారు. కాగా వర్షాకాల సమావేశాల్లోనే 2024–2025కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్ కూడా సమర్పించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.