ఏడో విడతలో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాల్లో పోలింగ్
రంగంలోకి దిగ్గజాలు వారణాసి నుంచి మోదీ
నా తెలంగాణ,సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా చివరి విడత ఎంపీ ఎన్నికలు ఏడో విడత జూన్ 1న జరగనున్న విషయం తెలిసిందే. చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అంతిమ దశ కావడంతో ఉత్కంఠ కొనసాగనుంది. మరోవైపు అంతిమ దశలో దేశంలోని దిగ్గజాలు పోటీలో ఉన్నారు.
వారణాసి ఎంపీ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీలో ఉండగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, అనురాగ్ ఠాకూర్ లాంటి దిగ్గజ నాయకులు పోటీలో ఉండడం విశేషం.
ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్‌లోని 8 స్థానాల్లో 134 మంది, ఒడిశాలోని 6 స్థానాల్లో 66 మంది, ఝార్ఖండ్‌లో 3 స్థానాల్లో 52 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 4 స్థానాల్లో 37 మంది, పశ్చిమ బెంగాల్‌లోని 9 స్థానాల్లో 124 మంది, పంజాబ్ 13 స్థానాలు, చండీఘర్ 1 స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.
2019లో ఏడోదశ..
జూన్ 1న ఎన్నికలు జరగనున్న ఏడో దశలో 57 స్థానాల్లో 2019లో బీజేపీ పనితీరు బాగానే ఉంది. గత ఎన్నికల్లో ఈ 57 స్థానాల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో పాటు జేడీయూ 3 సీట్లు, అప్నాదళ్ (ఎస్) 2 సీట్లు, శిరోమణి అకాలీదళ్ 2 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 1, బీజేడీ 2, జేఎంఎం 1, టీఎంసీ 9 సీట్లు గెలుచుకోగలిగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 32 సీట్లు గెలుచుకోగా, యూపీఏకు 9 సీట్లు మాత్రమే, ఇతర పార్టీలకు 14 సీట్లు వచ్చాయి.